Koratala Shiva: కొరటాల శివ.. ఒకప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. అపజయమే ఎరుగని దర్శకుల్లో శివ పేరు కూడా ఉండేది. రచయితగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కొరటాల శివ. భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, సింహా, బృందావనం, ఊసరవెల్లి లాంటి సినిమాలకు డైలాగ్స్ అందించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇక 2013 లో మిర్చి సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా తరువాత కొరటాల పట్టిందల్లా బంగారమే అన్నట్లు మారింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుస హిట్స్ ను ఇండస్ట్రీకి అందించాడు. ఇక జీవితం సాఫీగా సాగిపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ఆ దేవుడు, ఒక్క సినిమాతో కొరటాల జీవితాన్నే మార్చేసాడు. అదే ఆచార్య.
కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నాడు అనగానే ఇండస్ట్రీ మొత్తం ఊగిపోయింది. అసలు చిరును కొరటాల ఏ రేంజ్ లో చూపిస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు. ఆ సమయంలోనే ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని తెలియడంతో.. అసలు ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇలా ఎన్నో అంచనాల మధ్య ఆచార్య 29 ఏప్రిల్ 2022 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న కొరటాలను అధః పాతాళానికి తొక్కేసింది. సినిమా హిట్ అయితే హీరో ఖాతాలో.. ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలో పడడం షరా మాములే కాబట్టి.. ఈ డిజాస్టర్ కొరటాల ఖాతాలో పడింది. ఆ దెబ్బ నుంచి ఇప్పటివరకు కొరటాల కోలోకున్నదే లేదు.
చిరు సైతం ఈ ప్లాప్ కు కారణం కొరటాలనే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఎవరిని ఏమి అనలేక .. కొరటాల తన తదుపరి సినిమాతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అలా, ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల చేతికి చిక్కాడు ఎన్టీఆర్.
ఇక అప్పటికే ఎన్టీఆర్ తో కొరటాల జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇవ్వడంతో ఈ కాంబోపై ప్రేక్షకుల కన్ను పడింది. దేవర సినిమా అనౌన్స్ చేయడంతో.. మరోసారి ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా వైపే చూడడం మొదలుపెట్టింది. అందులో ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికీ దేవర హిట్ అవ్వడం చాలా ముఖ్యం.
దేవర హిట్ అయితే.. కొరటాల మీద ఉన్న విమర్శలు, ఆరోపణలు అన్ని తుడిచిపెట్టుకు పోతాయి. కానీ, దేవర ప్లాప్ అయితే కొరటాల కెరీర్ ముగిసినట్లేనా.. ? అని అంటే నిజమే అని చెప్పాలి. అదేం ఉండదు అని అనడానికి కూడా లేదు. కొరటాల మార్కెట్ పడిపోతుంది. చిన్న హీరోలతో కొరటాల మామ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
ఎన్టీఆర్ కు దేవర హిట్, ప్లాప్ తో పని లేదు. హిట్ అయ్యిందా సూపర్.. ప్లాప్ అయ్యిందా.. ఫ్యాన్స్ అందరూ దేవరను వదిలేసి వార్ 2 మీద పడతారు. లేకపోతే ప్రశాంత్ నీల్ సినిమా మీద పడతారు. మరి ఈ సినిమా కొరటాల కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.