Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏకంగా రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకోవాల్సిన ఈయన ఒకసారి అందుకున్నారు. కానీ ఇంకొకసారి లైంగిక ఆరోపణల కేసులో జైల్లో ఉండడంతో ఆ అవార్డును కాస్త చేజార్చుకున్నారు. ముఖ్యంగా తోటి డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో నేరం రుజువు కాకపోయినా జైలు జీవితం అనుభవించారు. ఇకపోతే ఇటీవలే బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన జానీ మాస్టర్, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించి స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు దక్కించుకున్నారు.
హిందీ సినిమాకి కొరియోగ్రాఫర్ గా అవకాశం..
అందులో భాగంగానే కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. కానీ కేస్ నమోదైన కారణంగా కమిటీ వాళ్ళు అవార్డును వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జానీ మాస్టర్ టాలెంట్ ను గుర్తించిన ఒక స్టార్ హీరో దయ తలిచి జానీ మాస్టర్ కి కొత్తగా అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), కీర్తి సురేష్(Keerthi Suresh)హీరో హీరోయిన్లుగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘బేబీ జాన్’. తమిళంలో విజయ్(Vijay )హీరోగా వచ్చిన ‘తేరీ’ సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ సమకూరుస్తున్నాడనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి జానీ మాస్టర్ నిజంగా ఈ అవకాశాన్ని అందుకుంటే మాత్రం ఆయన దశ తిరిగిపోతుందనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్..
జానీ మాస్టర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయనపై సడన్ గా లైంగిక ఆరోపణల కేసు నమోదయింది. తన దగ్గర పని చేసిన లేడీ కంటెస్టెంట్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ముఖ్యంగా ముంబై వంటి అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ముంబైలోని ఒక హోటల్లో తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధిత యువతి పోలీస్ స్టేషన్ లో తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని చెప్పడంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా బాధితురాలు తనను మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడని, దయచేసి జానీ మాస్టర్ నుంచి తనను కాపాడాలని ఆమె వేడుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. నేషనల్ అవార్డు వచ్చిందనే విషయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఇలాంటి పనులు చేయిస్తున్నారని కామెంట్ కూడా చేశారు. ఇకపోతే బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకు వచ్చినా.. సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ రద్దు చేయాలని బాధిత యువతి పిటిషన్ వేసినా హైకోర్టు నిర్ణయాలను చెరిపి వేయలేమని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇక అలా మొత్తానికి అయితే జానీ మాస్టర్ ఇప్పుడు అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.