Jay-Z : 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో తాజాగా మరో హాలీవుడ్ ర్యాపర్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీన్ ‘డిడ్డీ’ కోంబ్స్ (Sean diddy combs) పేరు ఉండగా, తాజాగా మరో ర్యాపర్ జే-జెడ్ పేరు కూడా యాడ్ అయ్యింది.
2000 ఏడాదిలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు కొత్త సివిల్ దావాలో ర్యాపర్లు జే-జెడ్ (Jay-Z), సీన్ ‘డిడ్డీ’ కోంబ్స్ (Sean diddy combs) పేరును యాడ్ చేశారు. సమాచారం ప్రకారం ఈ పిటిషన్ మొదట న్యూయార్క్‌లో అక్టోబర్‌లో దాఖలయ్యింది. అందులో సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్ తనను వేధించాడు అంటూ బాధితురాలు పేర్కొంది. అయితే ఆదివారం జే-జెడ్ పేరును చేర్చడంతో పిటిషన్ ను రీఫైల్ చేశారు. జే-జెడ్ (Jay-Z) అసలు పేరు షాన్ కార్టర్. ఇదే పేరుతో పిటిషన్ దాఖలైనట్టు తెలుస్తోంది.
జేన్ డో అనే మహిళ తన న్యాయవాది టోనీ బజ్బీ ద్వారా ఈ దావా వేసింది. దావాలో ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె క్లియర్ గా వివరించారు. డో పిటిషన్ లో తనతో ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయించారని ఆరోపించింది. అయితే అప్పట్లో అది పార్టీలో ప్రవేశించడానికి చేసుకున్న ఒప్పందమని ఆమె అనుకున్నారట. కానీ తీరా పార్టీ లోపలకు వెళ్తే… ఆ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గంజాయి, కొకైన్ తీసుకుంటున్న సెలబ్రిటీలు కన్పించారని డో పేర్కొంది. తనకు అందించిన డ్రింక్ తాగిన తర్వాత, మత్తుగా అనిపించిందని ఆమె గుర్తుచేసుకుంది. దీంతో విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిలోకి బాధితురాలు వెళ్ళగా… కోంబ్స్ (combs), కార్టర్ గదిలోకి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఈ దాడికి ఓ మహిళా స్నేహితురాలు సాక్షి అని కూడా ఆమె చెప్పింది.
కానీ కార్టర్ అకా జే-జెడ్ (Jay-Z) ఒక ప్రకటనలో బాధితురాలు తనపై చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. జే-జెడ్ తన ప్రకటనలో టోనీ బజ్బీ ద్వారా బ్లాక్ మెయిల్ ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. “ఈ ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. సివిల్ కాదు, క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయమని నేను వేడుకుంటున్నాను. మైనర్‌పై అలాంటి నేరానికి పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షించాలి” అని కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ఆరోపణల వల్ల తన కుటుంబం ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్పుకొచ్చారు జే. స్కూల్ కు వెళ్తే తన పిల్లలకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురావుతాయని, వాటికి వాళ్ళు ఈ ఏజ్ లో ఏమని సమాధానం చెబుతారు? అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
జే-జెడ్ (Jay-Z), బెయోన్స్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. 12 ఏళ్ల బ్లూ ఐవీ కార్టర్, ఏడేళ్ల కవల పిల్లలు రూమీ, సర్ ఉన్నారు. ఇక ఈ కేసుపై సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్’ ప్రతినిధులు తాజాగా స్పందించారు. ఈ పిటిషన్ ‘సిగ్గులేని పబ్లిసిటీ స్టంట్’ అని తమ ప్రకటనలో పేర్కొంటూ, బాధితురాలిపై మండిపడ్డారు.
అమెరికన్ ర్యాపర్ సీన్ డిడ్డీ కాంబ్స్ గత కొన్ని నెలలుగా అత్యాచారం, సెక్స్ ట్రాఫికింగ్, రాకెటింగ్ వంటి ఆరోపణలపై వరుస కేసులను ఎదుర్కొంటున్నారు.