Jayalalitha Assets:ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ భాషా చిత్రాలలో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు దివంగత నటీమణి జయలలిత (Jayalalitha) . 1965లో ‘కథానాయకుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఎంజీఆర్(MGR), ఎన్టీఆర్ (NTR) వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన అడుగుజాడల్లోనే జయలలిత కూడా రాజకీయాల్లోకి చేరింది. 1984 నుండి 1989 వరకు తమిళనాడు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన ఈమె ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకుంది. ఇక 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అరెస్టు అయింది. దాంతో తన ముఖ్యమంత్రి పదవి కూడా రద్దయింది. పదవిలో ఉండగానే కేసులో ఇరుక్కున్న ఈమె పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచింది. అయితే 2015 మే 23న మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఇక అలా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. రాజకీయాల్లోకి వెళ్ళకముందు దాదాపు 42 చిత్రాలలో నటించింది.
తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తులు అప్పగింత..
ఇదిలా ఉండగా జయలలిత వివాహం చేసుకోలేదు. దాంతో వారసులు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి పోతుంది? అనే ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తిని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అందజేయాలని గత కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు ఏ ఏ ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్పారు ఇప్పుడు చూద్దాం
ఆరు ట్రంక్ పెట్టెలలో ఆస్తులు..
కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తులలో పదివేల చీరలు, 750 జాతుల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 1,672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, 601 కిలోల వెండి వస్తువులు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిని భారీ భద్రత మధ్య ఆరు ట్రంకు పెట్టెలలో తరలించారు న్యాయమూర్తి హెచ్ ఎన్ మోహన్ సమక్షంలో వీటిని అధికారులకు అప్పగించడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసును 2014లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్నాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఇప్పటివరకు చాలా భద్రంగా భద్రపరిచారు . ఇక జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ రూ.913.14 కోట్లుగా అధికారులు అంచనా వేయగా.. ఇప్పుడు దాని విలువ రూ.4 వేల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారీ భద్రత మధ్య ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.