Kajal – Tamannaah..తాజాగా సీనియర్ బ్యూటీలైన తమన్నా (Tamannaah), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) లకు భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి వీరిద్దరినీ విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని ఆశ చూపి.. చెన్నై, పుదుచ్చేరికి చెందిన పదిమంది నుంచి సుమారుగా రూ. 2.40 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. 2022లో క్రిప్టో కరెన్సీ కంపెనీ కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభం అయింది. మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ తారలు కాజల్ అగర్వాల్, తమన్నాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ తర్వాత ముంబైలో పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి డబ్బును సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి నితీష్ జెయిన్ ,అరవింద్ కుమార్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్, తమన్నాలను విచారించాలని నిర్ణయించారు పోలీసులు. ఇక ప్రస్తుతం ఈ విషయము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై సినీ తారలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
తమన్నా కెరియర్..
తమన్నా కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్న తమన్నా.. మిల్క్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. అదే హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈమధ్య ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లకే పరిమితమైన తమన్నా.. ప్రస్తుతం ఓదెలా 2 అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ఈమె చేతిలో లేదు. కాబట్టి తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ (Vijay Varma)తో కలిసి ఏడడుగులు వేయబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
కాజల్ అగర్వాల్ కెరియర్..
తెలుగువారి చందమామగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ అటు వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తూనే.. ఇటు సినిమాలలో కూడా మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మంచి కథలు వింటున్నట్లు సమాచారం. అలా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం తెలుగు లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాలలో నటిస్తూ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి అటు హిందీలో కూడా అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా తోటి హీరోయిన్స్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో వీరు కూడా అలాంటి తరహా సినిమాలు చేయాలను కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.