Kareena kapoor:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్ (Saif Alikhan).. ఇటీవల బాంద్రాలోని తన నివాసంలో దుండగుడి కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. లీలావతి హాస్పిటల్లో చికిత్స అందుకొని సోమవారం రోజు డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కానీ లీలావతి హాస్పిటల్ కి చెందిన డాక్టర్ నితిన్ డాంగే ఇంకొద్ది రోజులు తమ పర్యవేక్షణలోనే ఉంటారని, డిశ్చార్జ్ చేయడం పై నిర్ణయం ఒకటి లేదా రెండు రోజుల్లోనే తీసుకుంటామని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ముంబై మీడియా.. బాంద్రా లో సైఫ్ అలీఖాన్ ఇంటి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ చాలా రచ్చ చేసింది. దీంతో కరీనా ఊహించని విధంగా స్పందించి, అందరిని వేడుకొంది.
ఫోటోగ్రాఫర్లపై కరీనాకపూర్ సీరియస్..
“మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి మహాప్రభో” అంటూ బెబో కరీనా సీరియస్ గా సోషల్ మీడియాలో స్పందించింది. అటు ఫోటోగ్రాఫర్లకు కఠినమైన హెచ్చరికలు కూడా ఆమె జారీ చేసింది. అయితే నిమిషాల్లోనే తన పోస్ట్ ను కూడా తొలగించడంతో పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే సైఫ్ – కరీనా దంపతులకు కుమారులు తైమూర్, జెహ్ ఆడుకోవడానికి ఆట వస్తువులు బాంద్రా ఇంటికి తీసుకొస్తున్నప్పటి ఫోటోని ఫోటోగ్రాఫర్లు షేర్ చేశారు. దీంతో “పిల్లల కోసం కొత్త బొమ్మలు వచ్చాయి” అనే శీర్షికతో ఈ ఫోటోగ్రాఫ్ ని పోస్ట్ చేసింది ఒక పోర్టల్.. అయితే దానిపై కరీనాకపూర్ (Kareena kapoor ) సీరియస్ అయ్యింది. “ఇప్పుడే దీనిని ఆపండి.. కనీసం మీకు మనసు ఉండాలి.మమ్మల్ని ఇంతలా వేధించడానికి..దయచేసి మమ్మల్ని వదిలేయండి” అంటూ చేతులు జోడించిన ఏమోజిని ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం కరీనా అధికారిక ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే సైఫ్ ఆరోగ్యానికి సంబంధించి కరీనా ఇబ్బందుల్లో ఉంటే, మరి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఆమెను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసింది ఇతడే..
ఇక సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి విషయానికి వస్తే.. బాంగ్లాదేశీ యువకుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ కేవలం దొంగతనానికి మాత్రమే సెలబ్రిటీల ఇళ్లపై రెక్కీ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి వెళ్లాడని, ఆ నేపథ్యంలోనే సైఫ్ పై దాడి చేసినట్లు తెలిపారు పోలీసులు. ఆగంతకుడికి, ఇంటి పనిమనిషికి మధ్య జరిగిన సంఘర్షణలో జోక్యం చేసుకోవడం వల్లే సైఫ్ ఛాతి వెన్నెముకకు కత్తిపోట్లు తగిలినట్లు వైద్యులు తెలిపారు.ఆగంతకుడి పై పోలీసులు కేసు నమోదు చేసుకోగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 311, 312, 331(4), 331(6), 331(7) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తన స్వగ్రామానికి పారిపోయే ప్రయత్నంలో భాగంగా థానే లోని హిరానందని ఎస్టేట్లో పోలీసులకు చిక్కడం జరిగింది. ఇక ఇతడు బాంగ్లాదేశ్ లోని ఝలోకాటి జిల్లాకు చెందిన వాడని పోలీసులు తెలిపారు.