South Central Railway: హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి మరిన్ని నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే చెన్నై, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతుండగా, మరో 8 రైళ్లను ఇక్కడి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఇబ్బందులు కలగకుండా పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించాలని భావిస్తున్నది.
అత్యాధునిక హంగులతో చర్లపల్లి స్టేషన్ నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సుమారు రూ.428 కోట్లు వెచ్చించి విమానాశ్రయాన్ని తలపించేలా ఏర్పాటు చేసింది. ప్రయాణీకులకు అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల మీద భారీగా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, ఆ భారాన్ని తగ్గించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించేలా తీర్చిదిద్దారు. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా పార్శిల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రీసెంట్ గా ఈ రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
కొనసాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 200 పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. స్టేషన్ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 శాతం పనులు పూర్తి కాగా, డిసెంబర్ లోగా మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ చివరి కల్లా పునర్నిర్మించిన సికింద్రాబాద్ స్టేషన్ ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకపోకలు కొనసగుతున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ లో 10 ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. వాటిని 5 భాగాలుగా విభజించి, ఒక్కో దశలో రెండు ఫ్లాట్ ఫారమ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి నుంచి రైళ్లు నడపడంతో పలు రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రాకపోకలు కొనసాగించే రైళ్లు ఇవే!
ఇక చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వాటిలో చెన్నై ఎక్స్ ప్రెస్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఇంటర్ సిటీ, కృష్ణా ఎక్స్ ప్రెస్, గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్, వరంగల్ పుష్ పుల్, శబరి ఎక్స్ ప్రెస్, రేపల్లె ఎక్స్‌ప్రెస్ (ఆఫర్ట్ నూన్), శాతవాహన, కాకతీయ ఎక్స్ ప్రెస్, కాచిగూడ- మిర్యాలగూడ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి, ఘట్ కేసర్ ఎంఎంటీఎస్, రేపల్లే ఎక్స్ ప్రెస్ (నైట్) రైళ్లు ఉన్నాయి. మార్చి నుంచి మరిన్ని రైళ్లు యాడ్ కాబోతున్నాయి.
Read Also: 8 నెలల డ్యూటీకి 12 నెలల సాలరీ.. రైల్వేలో ఉద్యోగంతో ఇన్ని లాభాలున్నాయా?