Mumtaj:సినీ ఇండస్ట్రీలో చాలామంది ఒక వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే.. మరికొంతమంది వృద్ధాప్య వయసు వస్తున్నా సరే వివాహం మాట ఎత్తడం లేదు. కొంతమంది సినిమాల మీద ఆసక్తితో వివాహానికి దూరం అంటుంటే.. మరికొంతమంది ప్రేమించిన వారు దూరం కావడంతో తట్టుకోలేక ఒంటరి అవుతూ ఉంటారు. ఇంకొంతమంది కొన్ని సినిమాలలో లేదా కొన్ని పనుల వల్ల సంబంధాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ (Pawan kalyan)హీరోగా నటించిన ఖుషి, అత్తారింటికి దారేది సినిమాలలో నటించిన ప్రముఖ నటి ముంతాజ్ (Mumtaj)కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దాని వల్లే తనకు పెళ్లి కాలేదు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముంతాజ్ నటించిన చిత్రాలు..
అప్పట్లో స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ ముంతాజ్. చాలా చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో గెస్ట్ రోల్ తో పాటు గ్లామర్ సాంగ్ లో కూడా మెరిసింది. తమిళ చిత్రాలలో కూడా స్పెషల్ సాంగ్ లు చేస్తూ అలరిస్తున్న ముంతాజ్.. చాలా గ్లామర్ గా కనిపిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు (Maheshbabu) ‘ఆగడు’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసిన ఈమె, చివరిగా రాజేంద్ర ప్రసాద్ (Rajendra prasad) నటించిన ‘టామీ’ అనే సినిమాలో నటించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయింది.
అలా చేయడం వల్లే తనకు పెళ్లి కాలేదు అంటున్న ముంతాజ్..
ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సడన్గా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం.. తనలో వచ్చిన మార్పే అంటూ చెబుతోంది. ముఖ్యంగా తాను ముస్లిం కుటుంబంలో పుట్టానని, అప్పట్లో తనకు ఖురాన్ అర్థమయ్యేది కాదని, అందులో అంతరార్థం తెలుసుకున్న తర్వాతే తనలో మార్పు మొదలయ్యిందని, ఆ కారణంగానే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముంతాజ్ తెలిపింది. ఇప్పటికే మక్కాను మూడుసార్లు సందర్శించిందట. హిజాబ్ కూడా ధరిస్తోంది. అంతేకాదు తాను చేసిన పాత్రలపై స్పెషల్ సాంగ్స్ పై కూడా మాట్లాడుతూ.. ఏమీ అర్థం కాని వయసులో గ్లామర్ పాత్రలు పోషించాను. అప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు అందుకే నాకు ఇష్టం వచ్చినట్లు నేను గ్లామర్ రోల్స్ చేశాను. కానీ ఇప్పుడు భయపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో నా సాంగ్స్ నేను చూడలేకపోతున్నాను. అతిగా గ్లామర్ ప్రదర్శించడం వల్లేనేమో నాకు ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటర్నెట్ నుండి ఆ ఫోటోలను తొలగించాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ కుదరడం లేదు. నేను చేసిన కొన్ని పాత్రల వల్లే నాకు పెళ్లి కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ముంతాజ్. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత తన గ్లామర్ ఫోటోలను ఎవరు షేర్ చేయవద్దు అని కూడా వేడుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ముంతాజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.