ISRO – Kumbh Mela : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన కుంభమేళను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుస్తా.. త్రివేణి సంగమం దగ్గర అత్యంత పరమ పవిత్రంగా భావించే స్నాన ఘట్టాల దగ్గరకు చేరుకునే కోట్ల మంది భక్తుల్ని ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఆసక్తి ఉన్న వాళ్ల కోసమే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొన్ని ఫోటోలను విడుదల చేసింది. కేవలం 45 రోజుల కుంభమేళ కార్యక్రమానికి ఏకంగా 45 కోట్ల మందికి పైగా హిందువులు హాజరై.. పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అలాంటి కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లు, ఇతర వసతుల కల్పన సహా.. అక్కడ గుమ్మిగూడిన జనం తాలుకూ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ చిత్రాలు.. ఇటీవల కాలంలో అక్కడ చోటుచేసుకున్న మార్పుల్ని కళ్లకు కట్టినట్లు స్పష్టంగా తెలుపుతున్నాయి.
కుంభమేళలో పాల్గొనే నాగసాధువులు, అఘోరాలతో పాటుగా సామాన్య భక్త జనంతో త్రివేణి సంగమం అత్యంత రద్దీ ప్రాంతంగా మారిపోతుంటుంది. అలాంటి చోట అందరికీ సకల వసతులు కల్పించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాలు కల్పించింది. వీటిని అధునాతన ఆప్టికల్ ఉపగ్రహాలు, పగలు-రాత్రి వీక్షించే సామర్థ్యమున్న రాడార్ శాట్ శాటిలైట్లు.. నిరంతరం చిత్రీకరిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మహా కుంభమేళాలో భారీ మౌలిక సదుపాయాలను ఏ తీరుగా తీర్చిదిద్దారో తెలుపుతూ.. కొన్ని చిత్రాల్ని తేదీల క్రమంలో విడుదల చేసింది. ఇందులో తాత్కాలిక టెంట్ సిటీ, నది నెట్‌వర్క్‌పై భారీ సంఖ్యలో నిర్మించిన పాంటూన్ వంతెనల నిర్మాణాలు.. ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా స్పేస్ వ్యూ చిత్రాలను విడుదల చేసిన ఇస్రో pic.twitter.com/AG5LX2JOnU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025
ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని ఆ ప్రాంతం మీదుగు ప్రయాణిస్తున్న సమయంలో రాశాట్ ఉపగ్రహాలు చిత్రీకరించాయి. వీటిలో 2023 సెప్టెంబర్ 15 నుంచి 29 డిసెంబర్ 2024 మధ్య తీసిన చిత్రాలున్నాయి. పాంటూన్ నెట్‌వర్క్‌తో పాటు టెంట్ సిటీ నిర్మాణాలు.. అందులో భాగంగా నిర్మించిన రోడ్లు, లే అవుట్ వివరాలు స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఈ చిత్రాలు అక్కడి అభివృద్ధి పనులు చూపేందుకు మాత్రమే కాదు.. కోట్ల మంది భక్తులు గుమ్మిగూడే ప్రదేశంలో విపత్తులు, తొక్కిసలాటలను నిరోధించే విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ పరిపాలన కూడా ఉపయోగపడుతున్నాయి. నిరంతరం అక్కడ అంతరిక్షం నుంచి ఓ కన్నేసి ఉంచుతున్న భారత ఉపగ్రహాలు.. త్రివేణి సంగమం దగ్గర పెద్ద సంఖ్యలో జనం గుమిగూడిన చిత్రాల్ని జనవరి 10న చిత్రీకరించాయి.
ఇస్రో ఉపగ్రహాల చిత్రాలను పరిశీలించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్.. ఈ అధునాతన సాంకేతికతలు.. కుంభమేళా వంటి అతిభారీ మతపరమైన సమావేశాలను నిర్వహించడంలో ఒక నమూనా మార్పును సూచిస్తాయని అన్నారు. అందరికీ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించేందుకు సాంకేతికత, సంప్రదాయ పద్ధతుల్ని ఎలా కలగలపవచ్చో చెప్పేందుకు మహా కుంభమేళాలో ఓ మంచి ఉదాహరణ అన్నారు. కొత్త శివాలయ్ పార్క్ నిర్మాణం అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 2024 నాటి చిత్రంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో.. డిసెంబర్ 2024 నాటికి శివాలయ్ పార్క్ పూర్తయిన విధానం కనిపిస్తోంది. భారత సరిహద్దులతో రూపొందించిన ఈ నిర్మాణం అందంగా కనిపిస్తుంది.
Also Read : కొవిడ్‌లో అనాథ చిన్నారులకు అంతా తానైన పీఎం కేర్స్.. ఏకకాలం రూ.20 లక్షల సాయం..
గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద హిందువులు జరుపుకునే ఐక్య వేడుక కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. మహాకుంభ్ నగర్‌ను రూపొందించింది. మహా కుంభమేళాలో సందర్శకులకు వసతి కల్పించేందుకు దాదాపు 1,50,000 టెంట్లు, 3,000 వంటశాలలు, 1,45,000 విశ్రాంతి గదులతో పాటు 99 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.