Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఇప్పటికే హరి హర వీరమల్లు చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచో రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. కొల్లగొట్టినాదిరో అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం విదితమే. కొల్లగొట్టినాదిరో సాంగ్ లో ఈ జంట ఎంతో అద్భుతంగా కనిపించారు. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు.. ఎంతో వినసొంపుగా, శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజమందిరానికి వచ్చి.. మహారాణి అందానికి ముగ్దుడైన వీరమల్లు.. ఆమె అందాలను.. ఆ అందంతో తన మనసును ఎలా కొల్లగొట్టిందో మనసులోని భావాలను చెప్తుంటే.. ఆడపిల్ల మనసు అర్ధం చేసుకోలేని మగాడివి కాదు కదా అని మహారాణి.. తన మనసులోని మాటలను మరింత మక్కువతో చెప్తున్నట్లు తెలుస్తోంది.
వీరమల్లు లుక్ లో పవన్ అదరగొట్టేసాడు. ఇక ఈ సాంగ్ లో నర్తించిన అందాల భామలు అనసూయ, పూజిత పొన్నాడ అందాలు ఒకపక్క అయితే.. మహారాణిగా నిధి అందాలు మరో ఎత్తు అని చెప్పొచ్చు. పవన్, నిధి జంట మధ్య ఫ్రెష్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ప్రతిభగల గాయనీ గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ సాంగ్ ను తమ వాయిస్ తో మరింత హైప్ తీసుకొచ్చారు.
హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.