Komatireddy Venkat Reddy: నేను సినిమా రేట్స్ గురించి పట్టించుకోవాలి అనుకోవట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమా టికెట్ల ధరలపై దృష్టి పెట్టడం లేదనిస్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యల కంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులే తనకు ప్రాధాన్యం అన్నారు. సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశానన్నారు. టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
“నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. కొత్త బెనిఫిట్ షోలకు, సినిమా టికెట్ల ధరలు పెంచమని నా దగ్గరకు రావొద్దని నేను చెప్పాను. నిన్న రిలీజ్ అయిన సినిమాకు, రేపు విడుదలయ్యే వాటి గురించి నా వద్దకు ఎలాంటి అప్లికేషన్లు రాలేదు. సినిమా టికెట్ల రేట్ల గురించి నన్ను కలవొద్దని చెప్పాను. అందుకే ఎవరూ నన్ను కలుస్తలేదు”-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రభాస్ రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. టికెట్ పెంపు ఆదేశాల్ని రద్దు చేసింది. టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ.. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేట్లు పెంచబోమని చేసిన వ్యాఖ్యల్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది.
ఈ నేపథ్యంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పుష్ప-2 ఘటన తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవరూ రావద్దని చెప్పానన్నారు. దీంతో తనను ఎవ్వరూ కలవడం లేదన్నారు. పుష్ప-2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానన్నారు. అప్పట్లో గాయాలపాలైన చిన్నారి ట్రీట్మెంట్ కు కూడా తానే డబ్బులు ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు సినిమా టికెట్ల ధరల పెంపుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేశారు.
Also Read: నా కొడుకు చనిపోయాడు.. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. కోమటిరెడ్డి ఆవేదన