వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర శిశువుల విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైల్వే స్టేషన్లే లక్ష్యంగా పసిపిల్లలను అపహరించి.. సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను ఖాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
గతేడాది డిసెంబర్ 28న ఖాజీపేట రైల్వే స్టేషన్ బయట నిద్రిస్తున్న ఐదు నెలల పసికందు మల్లన్న కిడ్నాప్‌కు గురయ్యాడు. బాబు తండ్రి కన్నా నాయక్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సిసిటివి ఫుటేజ్, టెక్నాలజీ పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో కేవలం ఒక బాబు మాత్రమే కాకుండా.. ఈ ముఠా గత కొంతకాలంగా వరుస కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పెద్దపల్లి జిల్లాకు చెందిన కొడుపాక సురేష్, వేల్పుల యాదగిరి ఈ ముఠాలో ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డారు. వీరు ప్రధానంగా వరంగల్, ఖాజీపేట, మంచిర్యాల, రామగుండం వంటి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను తమ అడ్డాగా మార్చుకున్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై లేదా స్టేషన్ బయట నిద్రిస్తున్న యాచకుల పిల్లలను ఎవరూ లేని సమయం చూసి అపహరించడం వీరి పని. ఇలా కిడ్నాప్ చేసిన ఐదుగురు చిన్నారులను సంతానం లేని దంపతులకు లక్షలాది రూపాయలకు విక్రయించారు.
పోలీసులు నిందితుల నుండి ఐదుగురు పసిపిల్లలను క్షేమంగా రెస్క్యూ చేశారు. కేవలం పిల్లలను ఎత్తుకెళ్లిన వారినే కాకుండా, చట్టవిరుద్ధంగా పిల్లలను కొనుగోలు చేసిన ఎనిమిది మంది దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘సంతానం లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాలి. అంతేకానీ ఇలాంటి ముఠాల వద్ద పిల్లలను కొనుగోలు చేయడం నేరం. కొనుగోలు చేసిన వారు కూడా శిక్షకు అర్హులే’ అని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ALSO READ: Komatireddy: నా కొడుకు చనిపోయాడు.. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. కోమటిరెడ్డి ఆవేదన