టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas ), నారా రోహిత్ (Nara Rohith) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘భైరవం’ (Bhairavam). తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
‘భైరవం’ టీజర్ వచ్చేసింది
‘భైరవం’ చిత్రం నుండి గత ఏడాది నవంబర్ 12వ తేదీన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ‘గణపతి వర్మ’అనే పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇకపోతే ముగ్గురు హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా… మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తూ ఉండగా… యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి ప్రియమణి (Priyamani) కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఏడాది సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘భైరవం’ సినిమా ఈరోజు 4:05 గంటలకు టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ ఎలా ఉందంటే ?
ఇక టీజర్ విషయానికి వస్తే… మొదట్లోనే “రాత్రి నాకు ఒక కల వచ్చింది… చుట్టూ తెగపడిన తలలు, మొండాలు… దూరంగా మృత్యు కాలాన్ని చేయించిన కృష్ణుడిలా… శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు రా శీను…” అంటూ జయసుధ చెప్పే డైలాగ్ తో ‘భైరవం’ టీజర్ పవర్ ఫుల్ గా మొదలైంది. టీజర్ చివర్లో “ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే… ఈ రామ లక్ష్మణులను ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ శ్రీను గాడు ఉన్నాడు” అంటూ సాయి శ్రీనివాస్ చెప్పే మరో డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది. టీజర్ మొత్తం చూసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురి మధ్య సోదర బంధంతో ఈ మూవీ రూపొందుతున్నట్టు అనిపిస్తోంది. ఇక టీజర్ మొదట్లోనే ఒక్కో హీరోకి ఒక్కో ఎలివేషన్ ఇచ్చారు. కానీ చివర్లో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ ను హైలెట్ చేశారు. మొత్తంగా వైలెన్స్ తో పూనకాలు తెప్పించే విధంగా ఈ మూవీ ఉండబోతుందని టీజర్ ద్వారా వెల్లడించారు. మరి టీజర్ లోనే ఈ ముగ్గురు హీరోల తాండవం ఇలా ఉంటే సినిమా ఇంకెంత ఇంటెన్స్ గా ఉండబోతుందో అనే బజ్ మొదలైంది. అలాగే టీజర్ లో డైలాగ్స్ తో పాటు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. టీజర్ ను పూర్తిగా చూశాక ఈసారి ఈ ముగ్గురు హీరోలకు హిట్ రావడం పక్కా అన్పిస్తోంది.