Manchu Manoj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని, ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మంచు వారసుడు మంచు మనోజ్ (Manchu Manoj). విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తో కలిసి మంచు మనోజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మే 30వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈయన తాజాగా తన ఫ్యామిలీ కోసం ఆరాటపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి కాళ్లు పట్టుకొని, తన తప్పేం లేదని చెప్పి, తన పాపను ఆయన ఒడిలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆ ఒక్కడి వల్లే కుటుంబానికి దూరమయ్యాను – మంచు మనోజ్
మంచు మనోజ్ మాట్లాడుతూ.. “9 సంవత్సరాలుగా నేను ఎవరి జోలికి వెళ్లకుండా నా పని నేను చేసుకుంటున్నాను. కరోనా సమయంలో మా ఆర్థిక పరిస్థితి మరింత చితికిపోయింది. అప్పుడు నా భార్య బొమ్మల కంపెనీ ప్రారంభించింది. దానికి నేను ఆర్ట్ వర్క్ చేశాను. ఆత్మగౌరవంతో బతికాము. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అయితే ఊహించని విధంగా ముప్పు ఏర్పడింది. నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా మీడియా ముందుకు వచ్చాను. నా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో మా తల్లిదండ్రులతో మళ్ళీ మేము కలిశాము. అయితే అది మా కుటుంబంలో ఒక వ్యక్తికి నచ్చలేదు. మరొకవైపు కాలేజీలో కొన్ని సమస్యల గురించి నాన్న వరకు వెళ్లడం లేదంటూ విద్యార్థులు నాకు లెటర్స్ రాసి ఇచ్చారు. అయితే అప్పుడు నీకేంటి సంబంధం అనడంతో ఆ మాట నేను భరించలేకపోయాను. అక్కడ పని చేసే వారందరితో నాపైన, నా భార్య పైన కేసులు పెట్టించారు” అంటూ తన అన్నయ్య మంచు విష్ణు(Manchu Vishnu) పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు మనోజ్.
నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది.. కానీ
“అటు సంబంధం లేని విషయంలో కూడా నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలు అయిపోయింది. ఆమెకు అన్నీ నేనే.. మేమేం తప్పు చేయలేదు. నాకు ఆవేశం ఉంది. కానీ తప్పు చేసే వ్యక్తిత్వం నాది కాదు. బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ చేయని తప్పును అంగీకరిస్తే నా పిల్లలకు భవిష్యత్తులో నేనేం నేర్పిస్తాను. మా నాన్న నేర్పించిన నీతి అది. అందుకే నేను ముందుకు వెళ్లలేక పోతున్నాను. ఎప్పటికైనా మేమంతా కలిసి ఉండాలని ప్రతి రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాను. సమస్యలు సృష్టించిన వారే తమ తప్పు తెలుసుకుంటారనే నమ్మకం కూడా నాలో వుంది. దయచేసి నా తండ్రిని మళ్లీ నాతో కలిసేలా చేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను” అంటూ తెలిపారు మనోజ్. ఇక ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తండ్రి కోసం ఆయన పడుతున్న ఆరాటం, పిల్లలకు నీతి నిజాయితీ నేర్పించాలని కోణంలో ఇలా అన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాను అంటూ తెలిపారు.