Tollywood : టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తెరపైకి వచ్చాక మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి విచిత్రంగా మారింది. ముఖ్యంగా రిలీజ్ డేట్ల విషయంలో ఎంత కన్ఫ్యూజన్ నెలకొంటుంది అంటే… ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ప్రేక్షకులకు క్లారిటీ లేకుండా పోతోంది. తాజాగా డిసెంబర్ 25 ను టార్గెట్ గా పెట్టుకున్న ఇద్దరు యంగ్ హీరోలలో ఒకరు వెనకడుగు వేయబోతున్నారని తెలుస్తోంది. “భైరవం” మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్, “రాబిన్ హుడ్” సినిమాతో నితిన్ ఇద్దరూ ఈ క్రిస్మస్ కి బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఇద్దరిలో ఒకరు క్రిస్మస్ పోరులో నుంచి తప్పుకోబోతున్నారని తెలుస్తోంది.
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ “భైరవం”. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నుంచి ఇప్పటికే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ ల ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేయగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధా మోహన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “ఛత్రపతి” రీమేక్ ఫలితం బెడిసి కొట్టడంతో, కొంతకాలం సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత “భైరవం” అనే మూవీతో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ మూవీ ఇదే ఏడాది తమిళంలో వచ్చిన “గరుడన్” మూవీకి రీమేక్ అని సమాచారం. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో… శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
ఇక మరోవైపు యంగ్ హీరో నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న యాక్షన్ డ్రామా “రాబిన్ హుడ్”. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. 2023 డిసెంబర్లో నితిన్ హీరోగా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ దారుణంగా నిరాశపరచడంతో నితిన్ మళ్లీ “రాబిన్ హుడ్” సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాబిన్ హుడ్” సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 25న రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ రోజున రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.
కానీ ముందుగా ప్రకటించినట్టుగా కాకుండా, ఈ రెండు సినిమాలలో నుంచి ఒక సినిమా క్రిస్మస్ రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇద్దరు హీరోలకి ఇప్పుడు హిట్ అన్నది చాలా అవసరం. అందుకే ఇలా పోటీతో కాకుండా సోలోగా రిలీజ్ అయితే సో బెటర్ అని భావిస్తున్నట్టుగా ఉన్నారు ఇటు నితిన్, అటు బెల్లంకొండ శ్రీనివాస్. మరి వీరిద్దరిలో ఎవరు క్రిస్మస్ రిలీజ్ డేట్ నుంచి తప్పుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.