Muralidhar Goud..మురళీధర్ గౌడ్(Muralidhar Goud).. ప్రస్తుతం భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ‘బలగం’ సినిమాతో పేరు సంపాదించుకున్న ఈయన.. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో టిల్లు తండ్రిగా నటించి, అక్కడ తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో హీరో వెంకటేష్(Venkatesh) మామ పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంతో పాటు తన ముందు ఉన్న లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు.
కోటీశ్వరుడు అవ్వడమే నా కల – మురళీధర్ గౌడ్..
మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ” మా కుటుంబం చాలా పేద కుటుంబం. మేము ఐదుగురు పిల్లలం. మా నాన్న ఒక్కడే కష్టపడి మా కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచి పేదరికం ని అనుభవించాను. అప్పుచేసి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. ఎవరి సహాయం ఆశించకుండా ఎదగాలనే నేను నిర్ణయించుకున్నాను. అయితే ఆ పేదరికం నుంచి పుట్టిన ఆశే నేను ఒక కోటీశ్వరుడిని కావాలి అని. ఇప్పుడు ఆ పట్టుదలతోనే ముందుకు వెళ్తున్నాను. వాస్తవానికి నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి, నేను పేదరికం అనుభవిస్తూనే వచ్చాను. ఆ కసితోనే కోటీశ్వరుడిని కావాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు మురళీధర్ గౌడ్. ఇక ప్రస్తుతం మురళీధర్ గౌడ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
డీజే టిల్లు వల్లే నా కెరియర్ మారిపోయింది – మురళీధర్ గౌడ్..
ఇక సినిమా జీవితంపై ఆయన మాట్లాడుతూ..” నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే నటనపై నాకు ఆసక్తి కలిగింది. మొదట్లో టీవీ సీరియల్స్ లో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నాను. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా పెద్ద అవకాశాలు వస్తాయని భావించాను. కానీ ఇండస్ట్రీలో అవకాశం దొరకడం అంత సులభమైన పనేమీ కాదని, అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని..పట్టుదలతో నేడు ఈ స్థాయికి వచ్చాను. ముఖ్యంగా సినిమా అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఇక డీజే టిల్లు సినిమా నా కెరియర్ కు ఎంతో కీలకం. ఈ సినిమా తర్వాతే నా ప్రయాణం కూడా మలుపు తిరిగింది. నన్ను ఒక మంచి నటుడిగా ప్రేక్షకులు గుర్తించడానికి కారణం అయ్యింది” అంటూ కూడా తెలిపారు.
ప్రేక్షక సోదరులకు నా కృతజ్ఞతలు..
“ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నాను. నా కెరియర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక లోకానికి , ప్రేక్షక సోదర సోదరీమణులకు నా కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ” అంటూ తెలిపారు మురళీధర్ గౌడ్ . ప్రస్తుతం ఈయనకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భవిష్యత్తులో మరింత ఎదిగి ఊహించని విజయాలను సొంతం చేసుకోవాలని, మీరు కన్న కలలు నిజం కావాలి.. మీరు కోటీశ్వరుడు కావాలి అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పేదరికంతో బాగా మగ్గిపోయిన ఈయన .. ఇప్పటికైనా తన కలను నెరవేర్చుకోవాలని కూడా అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.