Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకి, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణకు సింహాతో ఊపు తెచ్చిన ఈ డైరెక్టర్ తర్వాత లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే.. త్వరలోనే అందరినీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో అలరించబోతున్నారట. అయితే ఈసారి బాలకృష్ణ హీరోగా కాకుండా గెస్ట్ రోల్‌లో నటించబోతున్నారట.
మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ పాత్ర ఉంది. అందులో బాలయ్యను నటింప చేయటానికి బోయపాటి చర్చలు జరుపుతున్నారట. బోయపాటి శ్రీనుతో ఉన్న అనుబంధంతో పాటు పాత్రను తీర్చిదిద్దిన తీరు నచ్చటంతో ఈ సినిమాలో నటించటానికే బాలయ్య పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. రామ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్రయత్నమిది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్.. బోయపాటి మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.