టికెట్ బుకింగ్ విధానాన్నిసులభతరం చేయడానికి, ప్రయాణీకులకు అనుకూలంగా మార్చడానికి ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో రైల్ వన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులు రిజర్వ్ చేయబడిన, రిజర్వ్ చేయని టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సూపర్ యాప్ అన్ని రైల్వే సేవలకు వన్ స్టాప్ పరిష్కారం చూపిస్తోంది. అదే సమయంలో ముందస్తు రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. నిజమైన ప్రయాణీకులకు లాభం కలిగేలా ఈ నిర్ణయం తీసుకుంది.
రైలు ప్రయాణ సమయంలో చాలామంది ప్రయాణీకులు లోయర్ బెర్త్ ను ఇష్టపడుతారు. టికెట్ బుకింగ్ సమయంలో చాలా మంది లోయర్ బెర్త్ కోసం పోటీపడుతారు. లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత కూడా సీటు లభ్యతను బట్టి సైడ్ అప్పర్, మిడిల్, అప్పర్ బెర్త్ లకు టికెట్లు కేటాయించబడుతాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే లోయర్ బెర్త్ రిజర్వేషన్ విధానానికి సంబంధించిన తాజా రూల్స్, మార్గదర్శకాల గురించి ప్రయాణీకులు కచ్చితంగా తెలుసుకోవాలి.
భారతీయ రైల్వే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ లో.. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, గర్భిణీలకు లోయర్ బెర్త్ ఆటోమేటిక్ గా కేటాయించాలనే నిబంధన ఉంది. అయితే, బుకింగ్ సమయంలో బెర్త్ ల లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటారు. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ లు అందుబాటులో లేకపోవడం వల్ల మిడిల్, అప్పర్ బెర్త్ కేటాయించబడిన సీనియర్ సిటిజన్లకు ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్ లను కేటాయించే అధికారం టీసీలకు ఉంటుంది. లోయర్ బెర్త్ ను ఇష్టపడే ప్రయాణీకులు, టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్ లో ఎంచుకోవాల్సి ఉంటుంది.
రిజర్వ్ చేయబడిన కోచ్ లలో, రాత్రి 10:00 నుంచి ఉదయం 6:00 గంటల వరకు లోయర్ బెర్త్ ప్రయాణీకులు నిద్రపోయే అవకాశం ఉంటుంది. మిగతా సమయంలో మిడిల్, అప్పర్ బెర్త్ ప్రయాణీకులకు కూర్చునే అవకాశం కల్పించాలి. అయితే, RAC కింద కేటాయించబడిన సైడ్ లోయర్ బెర్త్ ల కోసం, RAC ప్రయాణీకుడు, సైడ్ అప్పర్ బెర్త్ లో బుక్ చేసుకున్న వ్యక్తి ఇద్దరూ పగటిపూట కూర్చోవడానికి సీటును షేర్ చేసుకుంటారు. సైడ్ అప్పర్ బెర్త్ కలిగి ఉన్న ప్రయాణీకుడికి రాత్రి 10:00 నుంచి ఉదయం 6:00 గంటల మధ్య లోయర్ బెర్త్ పై ఎటువంటి క్లెయిమ్ ఉండదు. ఎందుకంటే, ఆ సమయం లోయర్ బెర్త్ లో ఉన్న వ్యక్తి నిద్రించడానికి కేటాయించబడుతుంది.
Read Also: వందేళ్లుగా.. ఒకే మార్గంలో నడుస్తున్న ఈ రైళ్ల గురించి తెలుసా? నిజంగా గ్రేట్!