Priyamani.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ ప్రియమణి(Priyamani ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది ప్రియమణి. అందులో భాగంగానే 2017లో ముస్తఫా రాజ్ (Mustafa Raj ) తో ప్రియమణి ఏడడుగులు వేసింది. 2016లో వీరి నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి ఆన్లైన్ వేదికగా ఈ జంటపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై ఎప్పటికప్పుడు ప్రియమణి బాధపడుతూ.. తన బాధను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా పంచుకుంటూనే ఉంది. అయితే ఇప్పుడు తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా అసభ్యకరంగా కామెంట్లు చేస్తుండడంతో ఎమోషనల్ అయిన ప్రియమణి ఒక్కసారిగా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారాలు చేసే వారిపై మండిపడింది.
పుట్టబోయే పిల్లల్ని కూడా వదలడం లేదు – ప్రియమణి
ప్రియమణి మాట్లాడుతూ.. “నాకు నిశ్చితార్థం జరిగిన వెంటనే నా అనుకున్న మనుషులంతా కూడా సంతోషిస్తారని అనుకున్నాను. వారితో ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవాలని కూడా అనుకున్నాను. కానీ అప్పటినుంచి నాపై అనవసరమైన ద్వేషం కూడా ప్రారంభం అయింది. లవ్ జిహాద్ ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్ లో జాయిన్ చేస్తారా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అవి ఎంతగానో నన్ను బాధ పెడుతున్నాయి. నేను మీడియా పర్సన్ ని కాబట్టి ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా భర్త పై కూడా ఇలాంటి కామెంట్లతో ఎందుకు దాడి చేస్తున్నారు. ఆయన గురించి వివరాలు కూడా మీకు ఏవి తెలియదు. కానీ కామెంట్లు మాత్రం చేసేస్తారు. ఇప్పటికీ కూడా నేను నా భర్తతో దిగిన ఫోటోని షేర్ చేస్తే అందులో 10లో 9 మంది మా పెళ్లి గురించే కామెంట్ చేస్తారు. వాటి వల్ల ఇంకా బాధపడాల్సి వస్తోంది. ఎంతో మంది హీరోయిన్లు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళందర్నీ వదిలేసి నాపై ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారో అర్థం కావడం లేదు” అంటూ ఎమోషనల్ అయింది ప్రియమణి.
ప్రియమణి కెరియర్..
ఒకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తూనే.. మరొకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది ప్రియమణి. ఇక ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో కనిపించారు. విజయ్ దళపతి (Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటిస్తున్న జననాయగన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ప్రియమణి. అంతేకాదు ది ఫ్యామిలీ మ్యాన్ లో కూడా ఈమె కనిపించనున్నారు. తన పని తాను చేసుకోబోతున్నా.. తన వ్యక్తిగత జీవితాన్ని పదే పదే తీస్తూ విమర్శలు గుప్పించడంపై ఎమోషనల్ అయింది ప్రియమణి. మరి ప్రియమణి బాధను అర్థం చేసుకొని ఇకనైనా ఆమెపై విమర్శలు గుప్పించకుండా ఉంటారేమో చూడాలి.ప్రస్తుతం ప్రియమణి వరుస సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.