Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) ఇటీవల కాలంలో వరుసగా వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులు, తాను నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి, తప్పుడు కలెక్షన్లతో పోస్టర్లను రీలజ చేశారనే రూమర్లు, మూవీ డిజాస్టర్ కావడం వంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుంచి దిల్ రాజును వెంటాడుతున్న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) మూవీ కాపీ రైట్ కేసులో ఆయనకు ఉపశమనం లభించిందనే గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసు
2011లో దిల్ రాజు నిర్మించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీని తన నవల ‘నా మనసు నిన్ను కోరే’ నుండి కాపీ కొట్టారని రచయిత్రి ముమ్ముడి శ్యామల దేవి 2017లో ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పట్లో శ్యామల మూవీ నిర్మాత దిల్ రాజుపై కాపీరైట్ కేసు దాఖలు చేశారు. అప్పటి నుండి ఈ కేసు సబ్ జ్యుడీస్ కింద ఉంది. సిటీ సివిల్ కోర్టు, అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత, నిర్మాతపై చర్య తీసుకోవాలని కూడా ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది.
అప్పటి కేసులో ఇప్పటికి ఊరట
ఆ తరువాత దిల్ రాజు సిటీ సివిల్ కోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, జ్యుడీషియల్ బెంచ్ అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకుని, సివిల్ కోర్టు నిర్ణయంపై స్టే విధించింది. పైగా కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. మరి నెక్స్ట్ సుప్రీం కోర్టు ఈ వివాదంలో ఎలాంటి తీర్పును ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కమర్షియల్ గా సక్సెస్ సాధించింది, ప్రభాస్ , కాజల్ లతో పాటు ఇందులో నటించిన ఇతర ప్రధాన నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ లో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఈ సినిమాను మరోసారి రీరిలీజ్ చేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సంబరాలు
నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే రెండు సినిమాలు కూడా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 4 రోజుల గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అందులో ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఇదిలా ఉండగా, ఇటీవలే ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత ఇటీవల తన ఇల్లు, ఆఫీసులలో జరిగిన ఐటీ దాడులపై మౌనం వీడారు. ఈ ఐటీ రైడ్స్ సాధారణంగా జరిగేవే అని, తనపై మాత్రమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అనేక మంది నిర్మాతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.