Pawan Kalyan:సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని, ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమవుతారు. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చేతిలో సంపాదన లేక అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే అలా ఒకప్పుడు తమతో పాటు కలిసి నటించిన నటులకు ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు, మేమున్నాం అండగా అని పలువురు తోటి నటీనటులు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని ఏళ్ల క్రితం తన కామెడీతో, విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఫిష్ వెంకట్ కి అండగా పవన్ కళ్యాణ్..
ప్రస్తుతం ఆయనకు సినిమా అవకాశాలు వచ్చినా.. శరీరం సహకరించడం లేదు. దాంతో ఇంటికే పరిమితం అయ్యారు. దీనికి తోడు పని చేయకపోవడం వల్ల ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. సహాయం అంటూ ఇప్పటికే ఆయన చేసిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవ్వగా.. తాజాగా ఈ వీడియో కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరకు చేరింది. దీంతో ఆయన కూడా తన వంతు సహాయంగా ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు.
రెండు లక్షల ఆర్థిక సహాయం..
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ తోటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, 2లక్షల రూపాయలను సహాయంగా అందించారు. తన అనారోగ్య సమస్యల గురించి వివరించిన వెంటనే, అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఇక ఈ విషయాన్ని వెంకట్ ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ అలాగే ఆయన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని వెంకట మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్..
ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్య విషయానికి వస్తే.. గత కొంతకాలంగా ఆయన డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడంతో కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురైంది. దీంతో రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక ఒక హాస్పిటల్ నేరుగా ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ కు కొంతవరకు సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సహాయం అందించారు. ఫిష్ వెంకట్ విషయానికి వస్తే.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కామెడీ విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్నారు. నటుడిగా ఎంతో ఫేమస్ అయ్యారు. తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఫిష్ వెంకట్ కనిపిస్తే ప్రేక్షకుల నోట నవ్వు తన్నుకొచ్చేది. అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ‘ఆది’ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఫిష్ వెంకట్, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించారు. ఇక చివరిగా 2023లో ‘లింగొచ్చా’ అనే సినిమాలో నటించారు. ఇక తర్వాత అనారోగ్యం కారణంగా మళ్ళీ తెరపై కనిపించలేదు ఫిష్ వెంకట్. ఇప్పటికైనా ఆయనకు సరైన సమయంలో చికిత్స అందించాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కోరుతున్నారు.