Pooja Hegde:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా అడుగు పెట్టారు పూజా హెగ్డే. మొదటి సినిమాతోనే తన అందంతో ,అమాయకత్వంతో కుర్రకారు హృదయాలు దోచుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించారు. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పూజా హెగ్డే ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో బుట్ట బొమ్మగా పేరు సొంతం చేసుకున్నారు..ఈ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె.. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. ఇక మొన్నామధ్య టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసింది కానీ అవి ఈమె కెరియర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి.
అలాంటి పాత్రలలో నటించాలని ఉంది – పూజా హెగ్డే
దాంతో టాలీవుడ్ కి దూరమైపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్య(Suriya ) హీరోగా నటిస్తున్న ‘రెట్రో’ సినిమాలో నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న పూజా తన సినీ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ” మే ఒకటవ తేదీన రెట్రో సినిమా రాబోతోంది. ఈ సినిమా నన్ను పూర్తి భిన్నంగా చూపిస్తుంది. నా సామర్థ్యాన్ని పరీక్షించింది. యాక్షన్, డాన్స్, భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు మొదటి రోజు స్క్రిప్ట్ కోసం నన్ను కలవాలనుకున్నప్పుడు.. మేకప్ లేకుండా రమ్మని చెప్పారు. నాకు మేకప్ లేకుండా చేసే సినిమాలు అంటే ఎంతో ఇష్టం. రాధేశ్యామ్ సినిమాలో నా నటనలో భావోద్వేగాలను చూసి రెట్రో కి సరిగ్గా సరిపోతానని నన్ను తీసుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన నాతో చెప్పారు కూడా.. ఇప్పటివరకు నేను ఎన్నో చిత్రాలలో నటించాను కానీ ఇప్పటివరకు బయోపిక్ లో నటించలేదు..ఇంతకుముందు ఎప్పుడూ కూడా చేయని జానర్ ఇది. నాకు ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో కంటే స్వాతంత్ర్య పోరాట యోధుల కథలతో భాగం అవ్వాలని ఎప్పటినుంచో ఉంది. మహిళా ప్రాతినిధ్య కథలు, క్రీడా నేపథ్య కథలలో నటించాలని ఆశగా ఉంది” అంటూ తెలిపారు.
ప్రేక్షకుడు నా సినిమాతో స్ఫూర్తి పొందాలి – పూజా హెగ్డే
ఇక పదేళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నాకు తమిళ పరిశ్రమ మొదటి చిత్రం ఇచ్చింది. తెలుగు సినిమా నన్ను నటిగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే హిందీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే అవకాశం వచ్చింది. ఎన్నో అనుభవాలు కొత్త పాఠాలను నేర్పాయి. ఒకప్పుడు ఎలా నో చెప్పాలో తెలిసేది కాదు కానీ ఇప్పుడు ధైర్యంగా నో చెప్పగలిగే స్టేజ్ కి ఎదిగాను. ముఖ్యంగా నేను ఎంచుకున్న పాత్రలతోనే నేనేంటో తెలుసుకుంటున్నాను. ఒక సినిమాకి ప్రాణాలను కాపాడే శక్తి ఉందని నేను నమ్ముతాను. ఓ రోజు మీ మనసు బాగోలేకపోవచ్చు అలాంటి సమయంలో ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా చూస్తే అది మీ ఆలోచనలను మార్చేస్తుంది. నేను కూడా అంతే. నా సినిమాల ద్వారా ఒక్క వ్యక్తిని ప్రేరేపించినా చాలు అని అనుకుంటాను. అందుకే రూటు మార్చుకొని ప్రేక్షకుడికి ఉపయోగపడే పాత్రలతోనే అలరించాలని ముందుకు వెళ్తున్నాను ” అంటూ తెలిపారు పూజ హెగ్డే.