Power star Pawan Kalyan birthday special story: ఇటు సినిమా రంగంలో రికార్డులు క్రియేట్ చేసి అటు రాజకీయ రంగంలోనూ ఉన్నత పదవులలో రాణిస్తూ దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తూ అటు కేంద్రానికి, ఇటు ఏపీ ప్రభుత్వానికి వారధిగా సారధిగా ఉంటూ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నారు. నేడు జనసేనాని తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినిమా రంగంలో అనాసక్తితోనే చేరారు. ఎప్పుడూ దేశానికి ఏదైనా సేవ చేయాలి..చుట్టూ ఉన్న సమాజానికి తనవంతు సాయం అందించాలనే తపనతో చిన్నతనంనుంచీ ఆవేశంతో బ్రతికానని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1971, సెప్టెంబర్ 2న పుట్టిన ఈ పవర్ స్టార్ అసలు పేరు కళ్యాణ్ బాబు. అయితే వారి కుటుంబ ఆరాధ్య దైవమైన హనుమంతుడి మీద భక్తితో తన పేరులో పవన్ ని కలుపుకుని..పవన్ కళ్యాణ్ గా ఎదిగారు.
నటనపట్ల ఆసక్తి లేకుండానే..
అప్పటిదాకా సినిమాలంటే ఎందుకో శ్రద్ధ చూపేవారు కాదు పవన్. కేవలం తన అన్న సినిమాలు మాత్రమే చూసేవారట. అయితే ఏ మాత్రం ఆసక్తి లేని ఈ సినిమా రంగం వైపు తిరగడానికి తన వదినే కారణమంటారు. చిరంజీవి భార్య సురేఖ పవన్ ని మొదటినుంచి తన కుమారుడిలాగానే చూసేది. ఇంట్లో కూడా అందరికన్నా చిన్నవాడు కావడంతో పవన్ ఇష్టాలను ఎవరూ కాదనేవారు కాదు. వదిన చెప్పిన మాటను ఆలకించి తొలిసారి హీరోగా అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి మూవీతో తెరంగేట్రం చేశారు పవన్ కళ్యాణ్. ఈవీవీ సత్యన్నారాయణ దర్శకత్వంలో విడుదలైన ఆ మూవీలో నాగార్జున మేనకోడలు సుప్రియ కథానాయిక. అయితే తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. బద్రి, తమ్ముడు, ఖుషీ సినిమాలతో యూత్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తొలి చిత్రం దాకానే చిరంజీవి ఇమేజ్ వాడుకున్నారే తప్ప తర్వాత తనేమిటో తన చిత్రాల విజయం ద్వారా నిరూపించుకున్నారు. అభిమానులతో ముద్దుగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. అందరూ పవర్ కళ్యాణ్ అని పిలుచుకోవడం ఆరంభించారు.
పాత్ర కోసం ప్రాణం పెట్టి..
పాత్ర కోసం ప్రాణం పెట్టే పవన్ కళ్యాణ్ తమ్మడు సినిమాలో చేసిన రీస్కీ షాట్స్ కు ప్రేక్షకాభిమానులు ఫిదా అయ్యారు. రెండు అరచేతుల మీదగా కారు ఎక్కించుకోవడం, గుండెపై ఐస్ దిమ్మెలు పగలుగొట్టించుకోవడం, ఇక ఆ సినిమాలో మార్షల్ ఆర్త్స్ కోసం పవన్ తెరపై కష్టపడిన విధానం అంతా రియలిస్టిక్ గా ఉండటంతో మాస్ ప్రేక్షకులు పవన్ ని తమ గుండెకు హత్తుకున్నారు. మెగా స్టార్ కి అసలైన వారసుడు పవన్ కళ్యాణే అని డిసైడ్ అయిపోయారు. పవన్ కు చిన్నతనం నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం చేత బాల్యం నుంచే కరాటే సాధన చేసేవారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. తన సినిమాల వలన ఎవరైనా నిర్మాత నష్టపోతే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేవారు. జానీ, కొమరం పులి సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలగకుండా వాళ్ల కోసం తన రెమ్మునరేషన్ తగ్గించుకుని నిర్మాతలతో చెప్పి వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. రాజకీయాలలోకి రాకముందు నుంచే ఎవరైనా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు.
సాయమందించే విషయంలో ముందుకు..
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ప్రకృతి భీభత్సం జరిగినా..వారికి తన వంతు సాయం అందించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ ని అభిమానించేవారంతా కలిసి పవనిజం అనే సరికొత్త శక్తిగా మారారు. జనసేనలోనూ ఎలాంటి పదవులు ఆశించకుండా గ్రామాలలో, పట్టణాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ఒకే మాట..ఒకే బాట అదే నడిపిస్తోంది జనసేనాని వెంట. పవన్ ఎప్పుడూ పదవుల కోసం వెంటపడలేదు. పదవులే ఆయన వెంటపడి ఆయన చుట్టూ తిరిగాయి. పవన్ లోని ఆ సిన్సియారిటీనే జనంలో నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడింది.