గత వారం రోజుల క్రితం జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద వాతావరణం వేడెక్కింది. పెద్ద సంఖ్యలో బౌన్సర్లు మోహరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబు(Mohan Babu) పరస్పరం పోలీస్ స్టేషన్లో ఒకరి నుంచి ఒకరికి ప్రాణహాని ఉందని కంప్లైంట్ లు ఇవ్వడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వందల కోట్ల ఆస్తి ఉన్న ఈ కుటుంబంలో తగాదాలు ఎందుకు? అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. ముఖ్యంగా కొడుకుతో గొడవల కారణంగా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం, తన లైసెన్స్డ్ గన్ను బయటకు తీయడం, పెద్ద ఎత్తున బౌన్సర్లను ఇంటికి పిలిపించడం పలు అంశాల పైన ఈయనపై కేసు ఫైల్ అయ్యింది. అంతేకాదు బౌన్సర్ల విషయంలో మనోజ్, విష్ణు, మోహన్ బాబులకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయనను అరెస్ట్ చేసే విషయంపై రాచకొండ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు అరెస్టుపై పోలీసులు కీలక వ్యాఖ్యలు..
ఇక తాజాగా ప్రెస్ తో మాట్లాడిన రాచకొండ సీపీ సుధీర్ బాబు మోహన్ బాబు వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “మోహన్ బాబు, మనోజ్ వివాదంలో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాము. మరోవైపు మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎటువంటి ఆలస్యం లేదు. ఆయన దగ్గర మెడికల్ రిపోర్టులు తీసుకోవాలి ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చాము. కానీ ఆయన ఈనెల 24 వరకు సమయం అడిగారు. ఇక 24 లోపు విచారించడంపై మేము కోర్టును అడుగుతాము. ఇంకా ప్రస్తుతం మోహన్ బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నాయి.డబుల్ బ్యారెల్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉంది. తాజాగా ఈ రెండు గన్స్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విచారణ విషయంలో మరోసారి ఆయనకు నోటీసులు ఇస్తాము. నోటీసులకు స్పందించకపోతే మాత్రం డిసెంబర్ 24 తర్వాత కచ్చితంగా ఆయనను అరెస్ట్ చేస్తాం అంటూ సుధీర్ బాబు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
జల్పల్లిలో జర్నలిస్ట్ పై దాడి..
మంచు మనోజ్ (Manchu Manoj),మోహన్ బాబు(Mohan Babu)ఇంటిలోకి తనను అనుమతించడం లేదని, సెక్యూరిటీ పై ఆగ్రహం వ్యక్తం చేసి గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబును మీడియా వారు ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. వారి దగ్గర ఉన్న టీవీ మైక్ లాక్కొని వారి బుర్రలు పగలగొట్టారు మోహన్ బాబు. ఒక జర్నలిస్టుకి ముక్కు చెవికి అనుసంధానమైన ఎముక మూడు చోట్ల ఫ్రాక్చర్ అవ్వగా.. ఇంకొక జర్నలిస్టు చెవిలో కర్ణబేరికి రంధ్రం పడినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఈ జర్నలిస్టులు మోహన్ బాబు పై కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా జర్నలిస్టులను కలిసి క్షమాపణలు తెలియజేశారు. ఈ విషయంలో జర్నలిస్టులు తమ పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి.