Shivsena Ministers Rotation| రాజకీయాల్లో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అంతా షాకింగ్ పరిణామాలు జరుగుతుంటాయి. అందుకే రాజకీయాలు లాగా మరేవి అంత కిక్కు ఇయ్యవు. దీనికి అతిపెద్ద ఉదాహరణ మహారాష్ట్ర రాజకీయాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న ముగిసిన 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న పార్టీలు, కూటములు అంతగా అనిశ్చితిని చూశాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడడానికి మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. తాజాగా కొలువుదీరిన మంత్రివర్గానికి ఆయన ఒక షరతు విధించారు.
పార్టీలో ప్రతి ఎమ్మెల్యే మంత్రి పదవులు ఆశిస్తారు. కానీ కొందరికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. దీంతో మిగిలిన వారు అసంతృప్తితో ఉంటారు. చాలా సార్లు ఈ అసంతృప్తి కారణంగానే ప్రభుత్వాలు కూలిపోయిన సందర్బాలున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి.. మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ఏక్ నాథ్ షిండే తన పార్టీ మంత్రులతో ఒక అఫిడవిట్ సైన్ చేయించబోతున్నట్లు సమాచారం. ఈ అఢిడవట్ ప్రకారం.. మంత్రులందరూ 2 లేదా 2.5 సంవత్సరాల తరువాత తమ పదవికి రాజీనామా చేయాలి. ఆ మంత్రి పదవులు మిగిలిన ఎమ్మెల్యేలకు మిగతా కాలానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వారు మంత్రిపదవికి రాజీనామా చేయకబోతే వారిని పదవుల నుంచి తొలగించేందుకు అఫడవిట్ ప్రకారం పార్టీ అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండే కు అధికారం ఉంటుంది.
ఈ కొత్త అఫిడవిట్ విధానం గురించి షిండే శివసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రస్తుత మంత్రి శంభురాజ్ దేశాయ్ మీడియాకు తెలిపారు. పదవిలో ఉండి పనీతీరు బాగా ఉంటేనే వారిని కొనసాగిస్తామని.. లేకపోతే తొలగిస్తామని మంత్రి శంభురాజ్ చెప్పారు. ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలో ఆయనకు విధేయతగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు చాలా తక్కువ. అందరూ అధికారం కోసమే ఆయన వెంట ఉండి గతంలో శివసేన పార్టీ రెండుగా చీలిపోవడానికి కారణమయ్యారు.
Also Read: మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీకి రాజీనామా.. షిండే శివసేనలో చీలికలు!
మంత్రి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నాయకుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు దీపక్ కేసర్కార్, అబ్దుల్ సత్తార్, తనాజీ సావంత్ ఉన్నారు. వీరికి మంత్రి పదవులు దక్కకపోవడానికి మహారాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఉన్నారని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. వీరికి అదనంగా షిండే శివసేన పార్టీకి ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ రాజీనామా చేశారు. ఆయనకు ఎన్నికల సమయంలో మంత్రి ఇస్తామని షిండే హామీ ఇచ్చారు. కానీ కొత్త కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కులేదు.
మరోవైను షిండే శివసేనలో వివాదాస్పద ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ కు మంత్రి పదవి లభించింది. ఎమ్మెల్యే రాథోడ్.. షిండే కంటే ఫడ్నవీస్ కు ఎక్కువగా విధేయతగా ఉంటారని పేరు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఫడ్నవీస్ రికమెండ్ చేశారట.
శివసేనలో అసంతృప్తిగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో కేసర్కార్ కు మరో గౌరవ పదవి ఇస్తామని ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. ఈ కారణంగా కేసర్కార్ ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ అబ్దుల్ సత్తార్ పార్టీలో గొడవలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు సావంత్ గత ప్రభుత్వంతో ఆరోగ్య మంత్రిగా సరైన పనితీరు కనబర్చ లేదని, టెండర్ల విషయంలో, ఐఎఎస్ ఆఫీసర్లతో ఆయన గొడవపడ్డారని ఆరోపణలున్నాయి.