SSMB -29:సాధారణంగా ఒక సినిమా మొదలు పెట్టారంటే చాలు, ఆ సినిమా నుండి అప్డేట్ వదిలే వరకు అభిమానులు ఆగలేరు. అందుకే కొంతమంది వ్యూస్ కోసం, తమ సోషల్ మీడియా ఖాతా లేదా యూట్యూబ్ ఛానల్ ను పాపులర్ చేసుకోవడం కోసం ఆ సినిమాకు సంబంధించిన అంశాలను లీక్ చేస్తూ.. చిత్ర బృందానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పలు రకాల లీకులు అటు చిత్ర బృందానికి భారీ నష్టాన్ని మిగులుస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తన సినిమా కోసం పగడ్బందీగా లీకులు జరగకుండా ఏకంగా హీరోకి కూడా కండిషన్లు పెట్టి జాగ్రత్త పడుతున్నారు అంటే ఇక ఆయన తన సినిమాను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఎస్ఎస్ఎంబి 29’. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఏడాది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా ఇటీవల షూటింగ్లో పాల్గొనింది. ప్రత్యేకించి ప్రియాంక చోప్రా, మహేష్ బాబు కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుతున్నారని వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కనీసం షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని కూడా రాజమౌళి జనాల ముందు చెప్పడానికి ఆసక్తి చూపించడం లేదు. అటు మహేష్ బాబు (Maheshbabu) కూడా సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రహస్యాన్ని రాజమౌళి మెయింటైన్ చేస్తున్నారు.
నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ తో లీకులకు చెక్..
వాస్తవానికి రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఆసక్తిని మరింత పెంచేందుకు సినిమా షూటింగ్ ప్రారంభ రోజుకు సంబంధించిన ఫోటోలను, అలాగే సినిమాకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళి అలాంటిదేం చేయలేదు. అయితే కనీసం ఒకరోజు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో కెమెరాలనైనా అనుమతిస్తారు అనుకున్నారు. అదీ జరగలేదు. ఇక ఓపెనింగ్ ఎలా జరిగింది ? ఎవరు వచ్చారు? అనే విషయంలో కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా సినిమా నుంచి చిన్న లీక్ కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందుకే ఇలాంటి తప్పులు జరగకుండా పగడ్బందీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నటీనటులు, సాంకేతిక నిపుణులతో నిర్మాతలు నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్లను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది మహేష్ బాబుకు కూడా వర్తిస్తుందట. ముఖ్యంగా మహేష్ బాబు కూడా తన సెల్ ఫోన్ ని కూడా షూటింగ్ సెట్లోకి తీసుకురాకూడదని కండిషన్లు పెట్టారట రాజమౌళి. ఇకపోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మహేష్ బాబు సినిమా విషయంలో తప్పు జరగకపోవచ్చు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా వ్యవహరించి ఫైన్ విధించడంతోపాటు పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అందులో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజమౌళి ఇంత పక్కాగా ప్లాన్ చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.