Rakul Preet Singh – Jackky Bhagnani:రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ‘ అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. “ప్రార్ధన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ” అనే డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తన నటనతో , అందంతో తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక టాలీవుడ్ లో క్రమంగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ (Jackky bhagnani) ని ప్రేమించి, అతడితో మూడు ముళ్ళు వేయించుకుంది. ఇకపోతే మరో రెండు రోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవంను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యింది ఈ జంట. ఈ నేపథ్యంలోనే ఈ జంటకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవ్వడమే కాకుండా వీరు తమ పెళ్లి సమయంలో పెట్టిన కొన్ని రిస్ట్రిక్షన్స్ గురించి కూడా రకుల్ తాజాగా నోరు విప్పింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
నో ఫోన్ పాలసీ పెట్టడం వెనుక కారణం అదే..
సౌత్ గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో గత ఏడాది ఇదే సమయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లికి వచ్చిన ఆహుతుల నుండి మొబైల్ ఫోన్లు లాక్కోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక రోజు రోజుకి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె మాట్లాడుతూ.. “మా పెళ్లిని మా ఇద్దరితోపాటు మా పెళ్ళికి వచ్చిన ఆహుతులు అంతా కూడా ఆస్వాదించాలనేదే మా ఆలోచన. ఎందుకంటే మా జీవితంలో ఉత్తమమైన మూడు రోజుల పెళ్లి. ఆ పెళ్లిని మాతో పాటు ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి. మా పెళ్లికి వచ్చి వారు తమ సెల్ ఫోన్స్ లో బిజీ అయిపోతే.. మా పెళ్లిని వారు ఆస్వాదించలేరు. అందుకే “నో ఫోన్ పాలసీ” పెట్టాము. అయితే ఎవరో ఫోటోలు తీసి లీక్ చేస్తారని మాత్రం మేము ఆ పని చేయలేదు. పెళ్లికి వచ్చిన ఆహుతులు మాతోపాటు సందడి చేయాలి. డాన్స్ చేయాలి. ప్రతి సందర్భంలో మాతో కలిసి నడవాలి. చివరికి నా వెడ్డింగ్ డ్రెస్ తో కూడా నేను డాన్స్ చేస్తే అది చూసి మా బంధువులు ఎంజాయ్ చేయాలి. అదే నేను కోరుకున్నాను. అందుకే అలా చేశాము. అయితే మేము అలా చేయడం వల్ల మా బంధువులంతా కూడా మా పెళ్లిని చాలా మనస్పూర్తిగా ఆస్వాదించారు” అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే రకుల్ తమ పెళ్లి విషయంలో పెట్టిన నో ఫోన్ పాలసీ పై క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
రకుల్ సినిమాలు..
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) తో కలిసి ‘మేరీ హస్బెండ్ కీ బీవీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇక త్వరలోనే సౌత్ లో కూడా ఒక మంచి సినిమా చేస్తానని, ఇటు సౌత్ ఆడియన్స్ కి కూడా శుభవార్త తెలిపింది.