Game Changer Pre -Release Event Ram Charan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచడానికి ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. అనూహ్యమైన రెస్పాన్స్ సొంతం చేసుకొని, ఇప్పటివరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసింది. ఇక ఇటీవలే అమెరికాలోని డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విపరీతమైన రెస్పాన్స్ లభించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్..
ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే స్టేజ్ పై సినిమా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ అసలైన గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు చేయడంతో ఈవెంట్ కి వచ్చిన అభిమానులు ‘జై పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. “నమస్తే ఏపీ.. చాలా దూరం నుండి ఎంతో శ్రమ తీసుకొని, సినిమా ఇండస్ట్రీ మీద మా మీద ప్రేమతో ఎంతో దూరం నుండి ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అంటూ వినమ్రత చూపించారు రామ్ చరణ్.
అసలైన గేమ్ ఛేంజర్ ఆయనే..
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈవెంట్ కి వచ్చిన జనసంద్రాన్ని చూస్తుంటే నాకు ఒక ఘటన గుర్తుకొస్తోంది. తొలిసారి రాజమండ్రి బ్రిడ్జి మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించినప్పుడు, అప్పుడు అక్కడ కూడా ఇలాగే ఉంది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ ఎన్నోసార్లు, ఎన్నో రోజులు చేసాము. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో మాట్లాడాలనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనక వీరు ఎంతో టెన్షన్ గా ఉంది అంటూ టెన్షన్ పడుతూనే తెలిపారు. నిజంగా సినిమా పేరు గేమ్ ఛేంజర్. అయితే శంకర్ గారు ఎందుకు ఈ టైటిల్ పెట్టారో తెలియదు. తెరమీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ ఛేంజింగ్ పాత్ర.. కానీ నిజజీవితంలో మీ అందరికీ తెలుసు.. కేవలం ఏపీలో మాత్రమే కాదు ఇండియన్ పాలిటిక్స్ కి ఉన్న ఏకైక నంబర్ వన్ గేమ్ ఛేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. జనాల కోసం తాపత్రయపడే ఈయన మధ్య మేము పుట్టి పెరిగాము. ఆయన కుటుంబంలో మేము పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. శంకర్ ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్లు రాశారో మీ అందరికీ బాగా తెలుసు. నిజజీవితంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చూసి ఇలాంటి కథను రాశారు”. అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయనే అసలైన గేమ్ ఛేంజర్ అంటూ రామ్ చరణ్ కామెంట్లు చేశారు.