SATYA Re Release :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సత్య, క్షణక్షణం, శివ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ఈయన.. ఇప్పుడు అడల్ట్ చిత్రాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాత వర్మ కావాలని అభిమానులు కోరుకుంటున్న నేపథ్యంలో.. మళ్లీ తనను తాను మార్చుకొని మునుపటి వర్మగా తిరిగి రావాలని కూడా కోరుతున్నారు.
సత్య రీ రిలీజ్ కి సిద్ధం..
ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన ‘సత్య’ సినిమా జనవరి 17వ తేదీన రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో జెడి చక్రవర్తి, ఊర్మిళ హీరో, హీరోయిన్ గా నటించారు. ఇకపోతే రీ రిలీజ్ సందర్భంగా వర్మ ఒక సుదీర్ఘ నోట్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. సత్య సినిమా కోసం ఏం చేయకుండానే సత్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటూ కామెంట్ చేశారు. ఇక వర్మ తన పోస్టులో ఏం రాసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం.. “2025 జనవరి 17వ తేదీన సత్య రీ రిలీజ్ కాబోతోంది. అసలు ఈ సినిమా స్క్రిప్ట్ ఒక స్పష్టమైన దృక్పథం లేకుండానే సహజత్వంగా.. ప్రజల మనోభావాల ఆధారంగా రూపొందించబడింది. కానీ విడుదలైన తర్వాత ఆడియన్స్ ప్రశంసలు వెల్లువెత్తడంతో మేమంతా కూడా ఆశ్చర్యపోయాము.
ఒక ప్రణాళిక లేకుండానే సత్య రూపకల్పన..
ముఖ్యంగా ఈ సినిమా ప్రణాళిక బద్ధంగా రూపొందించబడలేదు. నిజజీవితంలో వ్యక్తుల నుండి ప్రేరణ పొంది ఆ సినిమాని తెరకెక్కించాము. ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు ఎలాంటి అంశాలైతే ఫాలో చేయాలో వాటిని ఏవీ కూడా మేము అనుకరించలేదు. అసలు చిత్ర నిర్మాణ ప్రక్రియను కూడా పాటించలేదు. సొంత అనుభవంతోనే ఈ సినిమాను రూపొందించాము. సినిమా చేసేటప్పుడు నేను ఒకటే నమ్ముతాను.. సినిమా వెనుక ఉన్న మాయాజాలం ఏంటంటే.. అందులో పాల్గొన్న వారి చేత ఎప్పుడు పునరావృతం చేయబడదు అని, దాని ప్రత్యేకమైన సృష్టిని అదే నిరూపించుకుంటుందని నమ్మాను. కాబట్టే నా సొంత తరహాలో సినిమాను తెరకెక్కించాను.
ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లపై సెటైరికల్ పోస్ట్..
ముఖ్యంగా ఈ సినిమాను నేను తెరకెక్కించేటప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందా? లేదా? అని నా బృందంతో చర్చించలేదు. కేవలం ఈ సినిమాలో మీకు ఈ పాత్ర ఇచ్చాను.. మీరు చేయాలి అని మాత్రమే చెప్పాను. వారు అదే చేశారు. నిజానికి మా వద్ద సరైన స్క్రిప్ట్ కూడా లేదు. కానీ మేము ప్రతి రోజు కూడా షూటింగ్ చేశాము. నిజానికి ఇప్పుడు ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్, భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అంటూ చాలా మంది ఉన్నారు. కానీ, సత్య టైంలో ఇవేం లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంటూ వర్మ కామెంట్లు చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లపై వర్మ సెటైరికల్ గానే పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.