RGV Saaree Trailer..రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చేసినా అందులో ఒక మెసేజ్ ఉంటుంది అనడానికి తాజాగా విడుదల కాబోతున్న ‘శారీ’ సినిమానే నిదర్శనం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఎక్కడో సోషల్ మీడియాలో కనిపించిన ఒక అమ్మాయిని, వెతికి పట్టి ఏకంగా సినిమానే తీసిన ప్రబుద్ధుడు వర్మ. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ కంట్లో పడితే ఎంతటి వారైనా ఫేమస్ అవ్వాల్సిందే. ఇప్పటికే నైనా గంగూలీ(Naina gangoly), అషు రెడ్డీ(Ashu Reddy), అరియానా(Ariyana ) ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని వర్మ ఫేమస్ చేశారు. ఇక ఆ జాబితాలోకి శారీ బ్యూటీ కూడా వచ్చి చేరింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ఒక్కసారిగా ఆరాధ్య దేవిగా పేరు సొంతం చేసుకుంది శ్రీలక్ష్మి సతీష్ (Srilakshmi Satish). ఇకపోతే తాజాగా ఈమెతో సినిమా చేసిన వర్మ అరాచకం సృష్టించారని చెప్పవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.ఇక ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
శారీ మూవీ ట్రైలర్ రిలీజ్..
అసలు విషయంలోకెళితే.. విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాంగోపాల్ వర్మ నుండీ తాజాగా రాబోతున్న చిత్రం” శారీ. ట్యాగ్ లైన్: టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ”.. గిరి కృష్ణ కమల్ (Giri Krishna Kamal) దర్శకత్వంలో ఆర్జీవి ఆర్.వి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పీ. బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ (Ravi Shankar Varma) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఆరాధ్య దేవి అలియాస్ శ్రీలక్ష్మి సతీష్ హీరోయిన్ గా, సత్య యదు (Satya yadu) హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా శారీ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆర్జీవి డెన్ లో శారీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ‘మ్యాంగో మీడియా’ ద్వారా విడుదల చేశారు. శారీ ని చూసి మైమరిచిపోయిన ఒక సైకో.. సోషల్ మీడియా ద్వారా ఆమెతో పరిచయం పెంచుకొని, చివరికి ఆమెను చిత్రవధకు గురిచేసి అనుభవించాలని చూస్తాడు. ఈ ఘటనలో హీరోయిన్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటిని చాలా చక్కగా ట్రైలర్లో చూపించారు. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది ” శారీకి , సైకోకి మధ్య ఆరాధ్య దేవి నలిగిపోతోంది. ఒక్క సినిమాతో వర్మ అరాచకం సృష్టించారు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మెసేజ్ ఇవ్వనున్న వర్మ..
ఇకపోతే రాంగోపాల్ వర్మ తన ఎమోషనల్ వాయిస్ తో.. “సోషల్ మీడియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గానీ ఫోర్ గ్రౌండ్ గానీ, ఏమీ తెలియకుండా నమ్మేయడంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం ఎన్నో విన్నాం.. చూసాం.. అలాంటి నిజజీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ శారీ ” అంటూ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లా తెలిపారు వర్మ.
నిర్మాత రవిశంకర్ వర్మ మాట్లాడుతూ..
ఇక చిత్ర నిర్మాత రవిశంకర్ వర్మ మాట్లాడుతూ..” మా శారీ చిత్రంలోని టీజర్ ,”ఐ వాంట్ లవ్”, అలాగే “ఎగిరే గువ్వలాగా” రెండు లిరికల్ పాటలను విడుదల చేసాము. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా విశేష స్పందన లభించింది. ఈ రోజు ట్రైలర్ ను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేశాము. ఇప్పుడు ట్రైలర్ కి కూడా మంచి స్పందన లభిస్తోంది. అన్ని భాషల్లో ఈ నెల 28న థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నాము” అంటూ తెలిపారు. మొత్తానికైతే నిజజీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని అరాచకం సృష్టిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.