Ram Pothineni:- టాలీవుడ్ ఉస్తాద్, యంగ్ హీరో రామ్ పోతినేని పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించటానికి రెడీ అయ్యారు. అందుకోసం ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్, యాక్షన్ అంశాలను మేళవించి సినిమాలను తెరకెక్కించటంతో దర్శకుడు బోయపాటికి ఓ స్టైల్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రామ్‌పై భారీ సెట్ వేసి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో ఏకంగా 1500 మంది డాన్సర్స్ ఉన్నారనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంత భారీ సెటప్‌తో చిత్రీకరిస్తోన్న సాంగ్‌కి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దీని తర్వాత మరో రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉంటుంది. జూన్ చివరికంతా చిత్రీకరణను పూర్తిచేసి సినిమాను దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. ఇంకా ఈ సినిమా టైటిల్ ఏంటనే విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఈ సినిమా కోసం రామ్ బీస్ట్ లుక్‌లో రెడీ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ హిట్ అందుకున్న రామ్‌కి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ రాలేదు. అందుకనే బోయపాటితో చేతులు కలిపారు.
అంతే కాకుండా ఇటు రామ్, అటు బోయపాటి శ్రీనుకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కానుంది. అయితే వీరిద్దరి తెలుగుసినిమాలు హిందీలో అనువాదమై వ్యూయింగ్ పరంగా సెన్సేషన్ నెంబర్స్‌ను టచ్ చేశాయి. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రామ్ పోతినేని పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.