Rangamarthanda: రంగమార్తాండ. ఉగాదికి రిలీజ్ కానుంది. ఒకరోజు ముందే ప్రీమియర్ వేశారు. బాగుందని అంటున్నారు. మరి, సినిమాలో కీ రోల్ పోషించిన రమ్యకృష్ణ.. మూవీ గురించి ఏమంటున్నారు? భర్త, దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ గురించి చెప్పగానే ఆమె రియాక్షన్ ఏంటి? షూటింగ్ ఎలా జరిగింది? తదితర అంశాలను ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ వివరించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
సూపర్ హిట్ మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్ రంగమార్తాండ. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ లీడ్ క్యారెక్టర్స్ చేశారు. కృష్ణవంశీ ఈ సినిమా చేస్తానని చెప్పగానే రమ్యకృష్ణ ఆశ్చర్యపోయారట. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలను ఎవరు చూస్తారంటూ భర్తను ప్రశ్నించారట. కానీ తన మాట వినకుండా.. కృష్ణవంశీ రంగమార్తాండ షూటింగ్‌ను మొదలుపెట్టేశారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.
ఇక, మూవీలో రమ్యకృష్ణ నటించిన రోల్ కోసం మొదట ఆమెను అనుకోలేదట కృష్ణవంశీ. చాలామంది హీరోయిన్లను అడిగారట. కానీ, వాళ్లెవరూ ఒప్పుకోలేదట. చివరికి ఇక ఎవరూ దొరక్కపోవడంతో రమ్యకృష్ణకే బాధనిపించి.. తాను చేస్తానని ముందుకొచ్చానని చెప్పారు.
అయితే, రమ్యకృష్ణ చేస్తాననగానే కృష్ణవంశీ వెంటనే ఓకే చేసేయలేదు. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాల్సి ఉంటుందని ముందే చెప్పారట డైరెక్టర్. రమ్య అంగీకరించడంతో.. ఆమెను సినిమాలోకి తీసుకున్నారు. మూవీలో తన మేకప్, హెయిర్ స్టైల్ మొత్తం తానే చేసుకున్నానని చెప్పారు రమ్యకృష్ణ.
తన పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదని చెప్పారామె. ఎమోషనల్ సినిమాలు తనకు అంతగా నచ్చవని.. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే.. భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రతీ సీన్ హృదయాలను హత్తుకునేలా తీశారని.. కృష్ణవంశీ కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుందన్నారు రమ్యకృష్ణ.
ఇక మరో ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ సైతం భార్య గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంట్లో ఏ నిర్ణయమైనా రమ్యనే తీసుకుంటుందని.. ఒకవేళ ఆమె లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని అంటుందని.. కానీ, తాను వాటిని పెద్దగా పట్టించుకోనని వారి ఫ్యామిలీ విషయాలు చెప్పారు. రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉండటం ఈ సినిమాకు అసెట్ అన్నారు.
రంగమార్తాండ క్లైమాక్స్‌లొ రమ్యకృష్ణను షూట్ చేయడం తనకు బాగా ఇబ్బందిగా మారిందన్నారు. తనను ఆ సీన్‌లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చిందని.. షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయని.. గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశానని చెబుతూ ఇంటర్వ్యూలోనే కంటతడి పెట్టుకున్నారు కృష్ణవంశీ.