SSMB29 Launch : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. అయితే నిన్న ఈ మూవీకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ పూజా కార్యక్రమాలతో జరిగిన సంగతి తెలిసిందే. కానీ దానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా ఇప్పటిదాకా బయటకు రాలేదు. కనీసం మీడియాకు కూడా ఈ ఈవెంట్ కు వచ్చే అనుమతిని ఇవ్వకపోవడంతో అసలు జక్కన్న ఏం దాస్తున్నారు ? అన్న ఆసక్తి మొదలైంది. మరి ఎందుకు జక్కన్న ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ లాంచ్ ఈవెంట్ ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత సీక్రెట్ గా నిర్వహించారంటే…
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి (Rajamouli) సినిమా చేస్తున్నారంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న నుంచి సినిమా రాబోతోంది అంటే నెలల తరబడి లేట్ అయినా సరే… ఇంకా ఓపికగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో కలిసి రాజమౌళి చేయబోతున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ మొదలవ్వక ముందే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుందని ఊహించారు. కానీ వాళ్లందరికీ జక్కన్న తీరు నిరాశను కలిగించింది. కనీసం ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడా ఇప్పటిదాకా ఆయన బయటకు రానివ్వలేదు. అయితే దీని వెనక ఓ రహస్యం ఉందంటున్నాయి సినీ వర్గాలు.
‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) లాంచ్ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి లభించింది. హైదరాబాదులోనీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్నపాటి పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంచ్ ను సింపుల్ గా చేశారు. ఇక మహేష్ బాబు, ‘ఎస్ఎస్ఎంబి 29’ టీం, జక్కన్న, మరికొంత మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈవెంట్ నుంచి ఒక్క పిక్ ను కూడా ప్రెస్ కి రిలీజ్ చేయకపోవడం వెనక ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటిదాకా మహేష్ బాబు (Mahesh Babu) ఎవ్వరూ చూడని రీతిలో స్పెషల్ లుక్ ను డెవలప్ చేశారని అంటున్నారు. అందుకే మహేష్ బాబు లుక్ లీక్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ ను ప్రైవేట్ గా నిర్వహించారని టాక్ నడుస్తోంది. జక్కన్న ఏం ప్లాన్ చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.
కానీ మహేష్ బాబు నిన్న మొన్నటిదాకా ఎక్కడ పడితే అక్కడ కనిపించడంతో ‘ఎస్ఎస్ఎంబి 29’లఓ ఆయన లుక్ ఇదేనంటూ తెగ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడేమో సడన్ గా మహేష్ బాబు లుక్ సీక్రెట్ అంటున్నారు. మరి జక్కన్న ఈ లీకు రాయుళ్ల యుగంలో ఇంకెన్ని రోజులు మహేష్ లుక్ ను సీక్రెట్ గా దాయగలుగుతారో చూడాలి.