Honey Rose: గత ఏడాది సంక్రాంతి సందర్భంగా బాలయ్య (Balakrishna) హీరోగా విడుదలైన చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఇందులో మీనాక్షి క్యారెక్టర్ లో అద్భుతంగా ఆకట్టుకుంది మలయాళీ బ్యూటీ హనీ రోజ్(Honey Rose). ఇకపోతే గత రెండు రోజుల క్రితం తాను ఒక బడా వ్యాపారవేత్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఒక సుదీర్ఘ పోస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో దాదాపు 27 మందిపై ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేసి.. కీలకమైన వ్యక్తిగా భావించిన ప్రముఖ వ్యాపారవేత్త బాబి చెమ్మనూరును సిట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు.
వ్యాపారవేత్త అరెస్ట్ పై హనీ రోజ్ కామెంట్స్..
ఇకపోతే వయనాడ్ లో అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలపగా.. దీనిపై హనీ రోజ్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఇప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ కేసు విషయం గురించి ఇప్పటికే నేను ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకు వెళ్ళాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన నాకు ప్రశాంతతను కలిగించారు” అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ హనీ రోజ్ కామెంట్ చేసింది.
లైంగిక వేధింపులపై సుదీర్ఘ పోస్ట్ విడుదల..
ఇదిలా ఉండగా ఇటీవల ఈమె ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో.. ” ఒక బడా వ్యాపారవేత్త కావాలని నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను సైలెంట్ గా ఉండడం కారణంగా అతడు నన్ను మరింత మానసిక వేదనకు గురి చేస్తున్నాడు. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. కానీ వేరువేరు కారణాలు చెప్పి నేను రిజెక్ట్ చేశాను. దాంతో అతడు నన్ను టార్గెట్ చేశాడు. దీనికి ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్ కి రావడం, వీలు కుదిరినప్పుడల్లా నాపై కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. అందుకే నేను పోలీసులను ఆశ్రయించాను” అంటూ ఆమె తెలిపింది.
అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది..
అలాగే దీనిపై ఆమె మాట్లాడుతూ..” వివరణాత్మక విమర్శలు, నా లుక్స్ పై వేసే సరదా జోకులు, మీమ్సును నేను స్వాగతిస్తాను. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుందని కూడా నమ్ముతాను. ఎవరైనా సరే అసభ్యకరంగా చేసే కామెంట్లను ఏమాత్రం సహించను”. అంటూ హనీ రోజ్ తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక హనీ రోజ్ విషయానికి వస్తే వీర సింహారెడ్డి సినిమా కంటే ముందే ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి తెలుగు చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వస్తాయనుకున్న ఆమెకు మాత్రం ఆఫర్లు తలుపు తట్టడం లేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి, జువెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్తూ డబ్బు బాగానే సంపాదిస్తోంది హనీ రోజ్.