కన్నడ హీరో దర్శన్(Darshan ), అభిమాని రేణుకా స్వామి (Renuka Swamy)హత్య కేసులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లి అనారోగ్య సమస్యల రీత్యా బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయన మెడకి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్ తో పాటు ఆయన సహచరులపై అదనపు ఛార్జ్ షీట్ ఖరారు కావడంతో, రేణుక స్వామి హత్య కేసు కాస్త మరో మలుపు తీసుకుంది. ముఖ్యంగా 1000 పేజీల ఛార్జ్ షీట్ లో ఫోరెన్సిక్ సాక్ష్యాలతో పాటు బలమైన సాంకేతిక అంశాలు అందులో పొందుపరిచినట్లు సమాచారం. ఈ 1000 పేజీల ఛార్జ్ షీట్.. కేసును మరింత బలం చేస్తోందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
దర్శన్ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు..
ఇకపోతే ఇక్కడ ఫోరెన్సిక్ నివేదికలతో సహా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నుండి మొత్తం 20కి పైగా సాక్ష్యాలను ఇందులో పొందుపరిచారట. ఫోరెన్సిక్ సాక్ష్యాలు దర్శన్ పై అభియోగాలను మరింత బలం చేస్తున్నాయి. నేరం జరిగిన ప్రదేశంలో నీలిరంగు టీ షర్టు ,జీన్స్ ధరించిన దర్శన్ చూపుతున్నట్లుగా సాక్షి అయిన పునీత్ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని ఫోటోలను సాక్ష్యాలుగా సేకరించి, ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు పోలీసులు. అంతేకాదు గతంలో మొబైల్ నుంచి తొలగించిన ఫోటోలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రాబట్టారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈ సాక్ష్యాలు అందించాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ వీడియోలో దర్శన్ తో పాటు రవిశంకర్, అను కుమార్, జగ్గా వంటి మొత్తం ఎనిమిది మంది నిందితుల ఫోటోలు కూడా ఉన్నాయి. మరోవైపు పవిత్ర గౌడ (Pavitra Gowda) దర్శన్ తో పాటు మరో ఆరుగురు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను గురువారం రోజు కర్ణాటక హైకోర్టు జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలో సింగిల్ జడ్జి బెంచ్ విచారించగా.. విచారణను నవంబర్ 26 కి వాయిదా వేశారు. మొత్తానికైతే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దర్శన్ మెడకు ఉచ్చు మరింత బిగుసుకుంటోంది అనడంలో సందేహం లేదు.
ప్రియురాలి కోసం అభిమానిని చంపిన దర్శన్…
ఇకపోతే దర్శన్ – పవిత్ర గౌడ అనే సహనటితో రిలేషన్ లో ఉన్నారు. అయితే ఆమె తమ బంధానికి పదేళ్లు అంటూ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో దర్శన్ అభిమాని రేణుక స్వామి పవిత్ర గౌడపై విమర్శలు గుప్పించారు. అసభ్యకర పదజాలాలతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో కాపురంలో చిచ్చులు పెట్టిందని, పలు రకాల మాటలతో ఆమెను చిత్రవధకు గురి చేసినట్లు వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే పవిత్ర గౌడ దర్శన్ తో పాటు మరికొంతమందితో కలిపి పథకం పన్ని రేణుక స్వామిని హత్య చేశారు. ఇక దీంతో నేరస్తులుగా మారి జైలు జీవితం అనుభవిస్తున్నారు. మరోవైపు దర్శన్ అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేణుక స్వామి కుటుంబాన్ని కలిసి వారి కుటుంబానికి అండగా నిలుస్తారని అందరూ కామెంట్లు చేశారు. కానీ ఆయన మాత్రం అలాంటివి చేయకపోవడంతో అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.