Congress Leader Sanjay: బర్త్ డే అంటేనే ఓ రేంజ్ లో ఉంటాయి సంబరాలు. అది కూడా నేటి రోజుల్లో బర్త్ డే వస్తున్న వారం నుండే ప్లానింగ్.. ఎలా చేయాలంటూ పెద్ద ప్రణాళిక ఉంటుంది. అలాగే ఇక నేతల బర్త్ డేలు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ప్లెక్సీల హంగామా.. భారీ కేక్స్.. ఇలా ఒకటేమిటి ఓ రేంజ్ లో ఉంటాయి సంబరాలు. కానీ ఈ నేత కూడా తన బర్త్ డే జరుపుకున్నారు. అది కూడా కాస్త వెరైటీగా..
నిజామాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అంటే ఆ జిల్లాలో తెలియని వారుండరు. సంజయ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంలో కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు నాడు.. తాను చేసే ఈ ఒక్క కార్యక్రమంతో తనకు ఎనలేని ఆనందం కలుగుతుందని, పేద కుటుంబాల చిరునవ్వులు చూసి మురిసిపోవడం.. అదే తనకు పుట్టినరోజు కానుకగా భావిస్తానంటున్నారు సంజయ్.
ఇంతకు బర్త్ డే రోజు ఆయన ఏమి చేస్తారంటే.. కొన్ని సంవత్సరాలుగా తన బర్త్ డే కు నిరుపేదలకు సామూహిక వివాహాలను జరిపించడం ఆనవాయితీగా సాగిస్తున్నారు సంజయ్. ఇప్పటికే కులమతాలకు అతీతంగా 150 కి పైగా సామూహిక ఉచిత వివాహాలు చేయించి, విందు భోజనాలు కూడా ఏర్పాటుచేసిన ఘనత ఈయనది.
Also Read: CM Revanth Reddy: అన్నా.. అంతా మంచిగుందా.. కూలీలతో సీఎం రేవంత్ రెడ్డి మాటామంతీ.. అసలేం జరిగిందంటే?
శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలు సందర్భంగా పేద జంటలకు మరోమారు ధర్మపురి సంజయ్ వివాహాలను ఘనంగా జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో నూతన వధూవరులు ఒకటి కాగా, వారిని సంజయ్ ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2005 నుండి తన పుట్టినరోజు నాడు పేద కుటుంబాలకు చెందిన వారికి వివాహం జరిపించే పరంపర సాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో తన పుట్టినరోజు నాడు సామూహిక వివాహాలు జరిపించడం జరుగుతుందన్నారు. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వధూవరులు, ధర్మపురి సంజయ్ కు కృతజ్ఞతలు తెలుపగా, అలాగే ఈ వివాహాలకు హాజరైన వారు, సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.