RGV with BIG TV : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయనపై ఏకంగా తొమ్మిది కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా మద్దిపాడులో రాంగోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు హైదరాబాదులో ఉంటున్న రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందించారు.. నవంబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా.. ఆయన “శారీ” సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే వారం రోజులపాటు విచారణకు హాజరు కాలేనని తన తరఫు న్యాయవాదితో వెల్లడించారు.
సానుభూతి భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా..
ఇక నవంబర్ 24వ తేదీకి విచారణను వాయిదా వేయగా.. ఆరోజు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో పోలీసులు అరెస్టు చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. దీనితో మండిపడ్డ రాంగోపాల్ వర్మ తాజాగా బిగ్ టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వర్మ మాట్లాడుతూ.. “అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలైనా రాసుకుంటాను కానీ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పను. ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారని, కానీ నేను దాక్కొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నానని ,పోలీసులు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ చేశారు. దాంతో ఏదో జరిగిపోయిందని , జనాలంతా కూడా నాకు ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తుంటే, భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటూ వర్మ కామెంట్లు చేశారు.
అవసరమైతే జైలుకెళ్తా..
నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ కూడా.. నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికి పెట్టాను. నా సినిమాలైనా, నా పోస్టులైనా కేవలం సెటైరికల్ గా మాత్రమే వుంటాయిం. నేను పెట్టే పోస్టులు, తీసే సినిమాలు ఎవరిని కూడా కించపరచడానికి కాదు. అంటూ క్లారిటీ ఇచ్చారు వర్మ. ఇక పోలీసులు నన్ను కలిసి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాతో చాలా మర్యాదపూర్వకంగానే నడుచుకున్నారు. వాస్తవానికి వారు నా ఆఫీసు లోపలికి కూడా రాలేదు. నిజానికి పోలీసులు అన్నది ప్రభుత్వంలో ఒక భాగం. వారి డ్యూటీ ని నేను గౌరవిస్తాను. వారు నన్ను అరెస్టు చేయాలనుకుంటే.. నేను ధైర్యంగానే జైలుకెళ్తాను.. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం నేను షూటింగ్ చేస్తున్న ‘శారీ’ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత జైలుకు వెళ్తాను. నేను జైలు కెళ్ళినా సరే అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రెండు మూడు సినిమా కథలను రాసుకుంటాను అంటూ వర్మ కామెంట్లు చేశారు.
వ్యూహం సినిమా ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీయలేదు..
ఇకపోతే ఎలక్షన్స్ సమయంలో వ్యూహం సినిమా చేసినప్పుడు కూడా జగన్ ను ఉద్దేశించి సినిమా చేయలేదని, ప్రస్తుత పరిస్థితులు తనకు అనిపించినట్టుగానే సినిమా చేశానని వర్మ తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో వర్మపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ విధంగా కామెంట్లు చేశారు.