Sankrantiki Vastunnam:2025 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం ఇది. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రంగా విడుదలైనప్పటికీ దాదాపు రూ.310 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా ఇందులో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జనవరి 14వ తేదీన సినిమా విడుదలయ్యింది. మరో రెండు మూడు రోజులు గడిస్తే నెల రోజులు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికే థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తోంది అంటే ఇక ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
త్వరలో టీవీలోకి రానున్న సంక్రాంతికి వస్తున్నాం..
ఇకపోతే సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతున్న నేపథ్యంలో ఓటీటీలోకి రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందని అందరూ అనుకుంటూ ఉండగా.. సడన్గా ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు జారీ చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యేందుకు సిద్ధమయింది. “త్వరలో వస్తున్నాం” అంటూ జీ తెలుగు ఒక ప్రకటన విడుదల చేసింది. అటు ఓటీటీలోకి విడుదల కాకముందే టీవీలో ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో అన్నారు కానీ ఇక డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ..
అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో ఇదివరకే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమెరికాలో బడా వ్యాపారవేత్తగా పేరు దక్కించుకున్న సత్య ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్).. ఇతనితో స్వరాష్ట్రంలో ఒక నాలుగైదు కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేశవ (వీకే నరేష్) ఆయనను హైదరాబాద్ కి తీసుకొస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతలను మీనాక్షి( మీనాక్షి చౌదరి) కి అప్పజెబుతాడు. అయితే సత్య హైదరాబాద్ కి రాగానే పాండే గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేస్తుంది..ఈ విషయం బయట పొక్కితే ప్రభుత్వం పడిపోతుంది అన్న భయంతో సీఎం కేశవ ఒక రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర్ రాజు (వెంకటేష్) ను రంగంలోకి దించాలని భావిస్తారు. అయితే ఈ ఆపరేషన్ కోసం రాజుని ఒప్పించే బాధ్యతను ఆయన మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును మీనాక్షి ఆ ఆపరేషన్ కోసం ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆపరేషన్కు పంపించడానికి భాగ్యం ఎలా ఒప్పుకుంది? వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ లో ఎదురైన సవాళ్ళు ఏంటి? అనేది ఈ సినిమా కథ. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.