Hyderabad Finance company Fraud | హైదరాబాద్ నగరంలోని ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లో పనిచేసే ఒక సీనియర్ ఉద్యోగి.. తమ కంపెనీ వినియోగదారులు జమ చేసిన నగదును వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించాడు. మొత్తం రూ.1.15 కోట్లు కంపెనీ ధనాన్ని మోసపూరితంగా కాజేసినట్లు సంస్థ నిర్వాహకులు గత శుక్రవారం హైదరాబాద్ నగర సీసీఎస్‌లో కేసులో ఫిర్యాదు చేశారు.
11 సంవత్సరాల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా చేరాడు. తర్వాత అతను కలెక్షన్ హెడ్‌గా పదోన్నతి పొందాడు. ఆ సంస్థ నుంచి రుణం తీసుకున్న వారి నుంచి అసలు, వడ్డీని వసూలు చేసే బాధ్యతలు అతనిపై ఉండేవి.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున తన వద్ద వస్తున్న నగదును దొంగిలించేందుకు అతను ఒక మాస్టార్ ప్లాన్ రూపొందించాడు. ఈ ప్లాన్ ప్రకారం.. అతను ఖాతాదారులకు తమ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి.. ఆ ఖాతాల్లోకి నగదును జమ చేయించేవాడు. గత ఏడాది డిసెంబర్‌లో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తించారు. అప్పటికే లక్ష్మీనారాయణ తన కుటుంబంతో పాటు పరారయ్యాడు.
Also Read: శవాన్ని దొంగలించిన హోటల్ వ్యాపారి.. దోపిడీకి పెద్ద స్కెచ్
కంపెనీ చేపట్టిన అంతర్గత ఆడిట్‌లో రూ.30 లక్షల నగదు దారి తప్పినట్లు తేలింది. లక్ష్మీనారాయణ నకిలీ పత్రాలు, ఫోర్జరీ (జాలీ సంతకాలతో) చేసి రుణం తీసుకున్న వారికి ఎన్‌వోసీలు జారీ చేసినట్లు కూడా బయటపడింది. సంస్థకు చెందిన ల్యాప్‌టాప్, కంప్యూటర్, మూడు మొబైల్ ఫోన్లు కూడా అతను తీసుకెళ్లినట్లు కంపెనీ అధికారులు గుర్తించారు. దీంతో కంపెనీ యజమాన్యం ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం.. రూ.1.15 కోట్ల నగదు గల్లంతైనట్లు వెల్లడించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగర సీసీఎస్‌కు కేసు బదిలీ చేయడంతో, ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సులో రూ.25 లక్షల దొంగతనం
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి శివారులో ఒక ప్రయాణికుడు బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోపు రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగును ఒక అజ్ఞాత వ్యక్తి దొంగిలించిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు మరియు బాధితుడు ఇచ్చిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లకు చెందిన వెంకటేశ్వర్లు రూ.25 లక్షల నగదుతో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. గోపలాయపల్లి శివారులోని ఒక హోటల్ వద్ద బస్సును టిఫిన్ కోసం నిలిపారు. వెంకటేశ్వర్లు తన నగదు బ్యాగును బస్సులోనే ఉంచి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు.
అయితే, అతను తిరిగి వచ్చేసరికి బ్యాగు కనిపించలేదు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో, సీఐ నాగరాజు మరియు ఎస్ఐ క్రాంతికుమార్ ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బస్సు నుంచి నగదు ఉన్న బ్యాగును ఒక అజ్ఞాత వ్యక్తి దొంగిలించినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.