SC on OTTs : నేటి డిజిటల్ యుగంలో వినోదం అతి సులభంగా అందుబాటులోకి వచ్చింది. సినిమాలు, సీరియళ్లు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు ఇలా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అయితే.. ఈ వినోద ప్రపంచంలో ఓ చీకటి కోణం కూడా ఉందని ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు డిజిటల్, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీ వేదికలతో పాటు, గూగుల్, యాపిల్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థలు కూడా అడల్ట్ కంటెంట్‌ను అడ్డదిడ్డంగా ప్రసారం చేస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన కొంతమంది పౌరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గట్టిగా స్పందించింది.
ఇది కేవలం సమస్య కాదు… సమాజానికి పట్టిన ముదురు వ్యాధి
జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇది చిన్న విషయం కాదని, సమాజాన్ని నాశనం చేసే ఒక పెద్ద సమస్య అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా… కేంద్రంతో పాటు, తొమ్మిది ప్రముఖ డిజిటల్ కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘‘ఇక చూడ్డం చాలూ. అసభ్యతపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.
పిటిషనర్ల ధీమా.. ‘‘సమాజాన్ని కాపాడాలి’’
ఈ వ్యాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్లుతున్న పిటిషనర్ల తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఓటీటీ వేదికల ద్వారా యువతపై చెడు ప్రభావం పడుతోందని, అసభ్యత పెరిగిపోతోందని ఆయన అన్నారు. ఇది సమాజానికి తీవ్రమైన ప్రమాదమని, కఠినమైన నియంత్రణలు అవసరమని ఆయన అన్నారు. అవసరమైతే పూర్తిగా నిషేధించాలి కూడా అని సమస్య తీవ్రతను తెలిపారు.
ప్రభుత్వం స్పందన.. చర్యలు చేపడుతున్నాం
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ‘‘ప్రాథమిక నియమాలు తీసుకొచ్చాం. కానీ ఈ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యల మీద కూడా పనిచేస్తున్నాం’’ అని కోర్టుకు తుషార్ మెహతా తెలియజేశారు. అయితే, పిటిషనర్లు మాత్రం, ఇది సరిపోదని అంటున్నారు. ఒక స్వతంత్ర, శక్తివంతమైన నియంత్రణ సంస్థ అవసరమని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.
ఈ సంస్థ ఓటీటీలు, సోషల్ మీడియా కంటెంట్‌ను గట్టి నియంత్రణలో ఉంచాలని, ఎటువంటి అసభ్య విషయాలు ప్రసారం కాకుండా చూసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పిటిషన్ కేవలం ఒక కోర్టు కేసు కాదు. ఇది డిజిటల్ ప్రపంచంలో విలువల కోసం సాగుతున్న ఒక గొప్ప పోరాటం. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ కోర్టు గట్టిగా నిబంధనలు తీసుకురావాలని ఆదేశిస్తే, నేటి వినోద ప్రపంచం కొత్త రూపంలో మారే అవకాశం ఉంది. అసభ్యతకు చెక్ పడుతుందా? మళ్లీ విలువలు బతుకుతాయా? అన్నది త్వరలో తేలనుంది.