Indian Railway Waiting Ticket: ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కఠినమైన నియమాలు అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగి ఉన్న ప్రయాణీకులు స్లీపర్ తో పాటు ఏసీ కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతించబడరని వెల్లడించింది. వెయిటింగ్ టికెట్లు ఉన్న వాళ్లు కేవలం జనరల్ క్లాస్ లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా IRCTC ద్వారా బుక్ చేసుకున్న ఆన్‌లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే, రైలు బయల్దేరే సమయానికి అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందని తెలిపింది. అయితే, కౌంటర్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లను తీసుకున్న ప్రయాణీకులు ఇప్పటికీ చాలా మంది స్లీపర్, AC కోచ్ లలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ఇండియన్ రైల్వే కొత్త రూల్ ఏం చెప్తుందంటే?
మే 1 నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణీకులు స్లీపర్, AC కోచ్ లలో ప్రయాణించేందుకు అనుమతించరు. వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకుడు ఆయా కోచ్ లలో ఇతరుల సీట్లలో కూర్చొని ఉంటే జరిమానా విధిస్తారు. లేదంటే జనరల్ కంపార్ట్ మెంట్ కు తరలిస్తారు. కొన్ని సందర్భాల్లో టీటీఈ జరిమానా విధించడంతో పాటు జనర్ బోగీకి పంపించే అవకాశం ఉంటుంది.
కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు ఈ రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నియమం కారణంగా వెయిటింగ్ లిస్టు టికెట్ హోల్డర్ల నుంచి ఎదురయ్యే సమస్యలు ఇకపై ఉండవన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా కన్ఫర్మ్ టికెట్లు ఉన్న వాళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు.
వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులతో ఇబ్బందులు
ఆయా సందర్భాల్లో వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, AC కోచ్ లలోకి ప్రవేశించి, కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకుల సీట్లలో బలవంతంగా కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు, కోచ్ లలో వెయిటింగ్ టికెట్ ప్రయాణీకుల సంఖ్య పెరిగినప్పుడు దారులు బ్లాక్ అవుతాయి. దీనివల్ల ప్రయాణీకుల రాకపోకలు ఇబ్బంది కలుగుతుంది. సో, ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీరు కూడా వెయిటింగ్ టికెట్ తో రైలు ప్రయాణం చేస్తుంటే, ఇబ్బందులు పడకుండా, నేరుగా జనరల్ బోగీలోకి వెళ్లడం ఉత్తమం. అలా కాకుండా స్లీపర్, ఏసీ బోగీల్లోకి ఎక్కితే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జరిమానా సహా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో, ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!