Shiva Raj Kumar: ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar)ఇటీవలే చికిత్స నిమిత్తం ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు అమెరికాలో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తి అయింది. దాదాపు కొన్ని గంటల పాటు సాగిన ఈ శస్త్ర చికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలిసి అటు అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు శివ రాజ్ కుమార్ త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నారు.
శివరాజ్ కుమార్ కు ఆపరేషన్ పూర్తి..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శివరాజ్ కుమార్ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 24 మంగళవారం సాయంత్రం 6 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలు) శివరాజ్ కుమార్ కు ఆపరేషన్ జరిగిందని సమాచారం. దాదాపు 6 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారట. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ మురుగేష్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగిందట. ఇక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు శివ రాజ్ కుమార్ సన్నిహిత వర్గాల వారు. నిజానికి శివరాజ్ కుమార్ ఈ విషయంపై మొదటి నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు. తన ఆరోగ్యం గురించి ప్రతి విషయాన్ని కూడా ఆయన పాజిటివ్ గానే తీసుకున్నారు. ఇక సర్జరీ జరుగుతున్న సమయంలో కూడా పాజిటివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఆలోచనలే ఆయన ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణమయ్యాయని సమాచారం. మరోవైపు శివ రాజ్ కుమార్ జనవరి 24వ తేదీ తిరిగి ఇండియాకి రాబోతున్నట్లు సమాచారం.
శివన్న కోసం ప్రత్యేక పూజలు..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం శివరాజ్ కుమార్ కు క్యాన్సర్ ఉందంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన శివరాజ్ కుమార్.. “నాకు క్యాన్సర్ ఉందో లేదో తెలియదు. అసలు నాకున్న వ్యాధి ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఇది క్యాన్సర్ అయితే కాదు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తాను”అంటూ తెలిపారు. శివరాజ్ కుమార్ చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని అభిమానులు త్వరగా కోలుకోవాలని.. పూజలు, పునస్కారాలు, ప్రార్ధనలు చేశారు. ఇక మొత్తానికి అయితే అభిమానుల పూజలు ఫలించాయి.
శివరాజ్ కుమార్ సినిమాలు..
కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఒకవైపు తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు ఇతర భాషా స్టార్ హీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు.ఇటీవలే రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘శివన్న 45’ సినిమా పనులు పూర్తయ్యాయి. ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స పూర్తయిన కారణంగా కొన్ని నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ సినిమాలలో నటించనున్నట్లు సమాచారం.