Allu Aravind: ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. తన కుమారుడు శ్రీ తేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందనే విషయం తెలిసిందే. అందుకే అప్పటినుండి శ్రీ తేజ్.. కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. కొన్నాళ్ల పాటు వెంటిలేటర్ సాయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం కాస్త నిలకడగా ఉందని తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు బులిటెన్‌ను అందించారు. తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి వెళ్లి తనకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు.
ఆర్థిక సాయం
శ్రీ తేజ్ చికిత్సకు కావాల్సిన ఖర్చును తానే భరిస్తానని అల్లు అర్జున్ ఒక వీడియోలో బయటపెట్టాడు. కానీ తను చెప్పినట్టుగా చికిత్సకు ఆర్థిక సాయం అందిందో లేదో తెలియదు. ఇంతలోనే ప్రభుత్వం కూడా శ్రీ తేజ్ చికిత్స ఖర్చును తామే భరిస్తామంటూ ముందుకొచ్చింది. అలా ఇప్పటివరకు ప్రభుత్వమే చికిత్సకు కావాల్సిన ఖర్చును చూసుకుంటూ వస్తోంది. ఇంతలోనే సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరుగా వస్తూ అందరి ముందు శ్రీ తేజ్ చికిత్సకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్టుగా ప్రకటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి అల్లు అరవింద్ కూడా యాడ్ అయ్యారు. శ్రీ తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్టుగా ఆసుపత్రిలోనే అందరి ముందు ప్రకటించారు.
Also Read: ఎంక్వైరీలో అల్లు అర్జున్ మౌనం.. ఆయన సమాధానాలు ఇవ్వని ప్రశ్నలు ఏంటంటే.?
విదేశాలకు వెళ్లాడు
అల్లు అరవింద్ అందించిన రూ. 2 కోట్లలో అల్లు అర్జున్‌కు సంబంధించింది రూ.1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్ తరపున రూ.50 లక్షలు, సుకుమార్ తరపున రూ.50 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తం ‘పుష్ప 2’ మేకర్స్ అంతా కలిపి ఈ విరాళాన్ని శ్రీ తేజ్ కుటుంబానికి అందించినట్టుగా తెలుస్తోంది. అసలైతే అల్లు అరవింద్, సుకుమార్ కలిసే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న శ్రీ తేజ్‌ను కలవాల్సింది. కానీ సుకుమార్ విదేశాల్లో ఉండడం వల్ల ఆసుపత్రికి రాలేకపోయారని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 2’ టీమ్ అంతా కలిసి అందించిన విరాళాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఎఫ్ డీ సీ చైర్మెన్ దిల్ రాజుకు అందించారు అల్లు అరవింద్.
విరాళం కోసం
అల్లు అరవింద్ (Allu Aravind) ఇప్పటికే ఒకసారి శ్రీ తేజ్‌ను, తన కుటుంబాన్ని కలవడానికి కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు మామూలుగా వారిని కలిసి, వారితో మాట్లాడి, ఈ విషయంపై మీడియా ముందు స్పందించి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత కూడా పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు శ్రీ తేజ్‌ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లారు. అంతే కాకుండా ఒకరి తర్వాత ఒకరుగా వారికి ఆర్థిక సాయం అందించారు. దీంతో అల్లు అరవింద్ మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, శ్రీ తేజ్‌ను చూసి తనకు రూ.2 కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. అయినా ఇప్పటికీ అల్లు అర్జున్ ఆసుపత్రికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.