Armaan Malik : పాపులర్ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) తాజాగా తన ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా, అవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik). ఆయన కేవలం హిందీ సినిమాలకే కాదు తెలుగు సినిమాలకు కూడా సింగర్ గా పని చేశారు. ‘రక్త చరిత్ర 2’ అనే సినిమాతో అర్మాన్ మాలిక్ సింగర్ గా టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆయన ‘ఆట ఇప్పుడు మొదలై’ అనే పాటను పాడి అదరగొట్టారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాలో మరో పాటను పాడారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్ – రాశి కన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు వచ్చే రొమాంటిక్ సాంగ్ “నిన్నిలా నిన్నిలా” అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాట ఇన్స్టంట్ హిట్ కావడంతో అప్పటి నుంచి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు అర్మాన్ మాలిక్ ఇంటి తలుపు తట్టడం ఎక్కువైంది.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే అల్లు అర్జున్ సినిమాలో ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ మూవీలో ‘అనగనగా’, సాయి పల్లవి – శర్వానంద్ జంటగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అర్మాన్ (Armaan Malik). వీటన్నింటి కంటే ఎక్కువగా ‘అల వైకుంఠపురం’ సినిమాలో ఆయన పాడిన ‘బుట్ట బొమ్మ’ పాటతో ఒక్కసారిగా ఎక్కడలేని స్టార్డం వచ్చి పడింది అర్మాన్ మాలిక్ కి. ఈ పాట దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు ఈ పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఆయన సైమా అవార్డును కూడా అందుకున్నారు. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘కమిటీ కుర్రోళ్ళు’, ‘సారంగపాణి జాతకం’ వంటి సినిమాల్లో కూడా అర్మాన్ పాటలు పాడారు.
తాజాగా ఈ స్టార్ సింగర్ కొత్త ఏడాది కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. పెద్దల ఆశీర్వాదంతో ఆయన ప్రియురాలితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం విశేషం. తన స్నేహితురాలు, ఇన్ఫ్లుయెన్సర్ ఆశ్నా ష్రాఫ్ (Aashna shroff)ను అర్మాన్ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి గ్రాండ్ గా జరగగా, తాజాగా అర్మాన్ (Armaan Malik) ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం అర్మాన్ బయట పెట్టకపోవడం గమనార్హం. ప్రైవేట్ గా ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.