Singer Kousalya..ఈ మధ్యకాలంలో సింగర్స్ ఒకరి తరువాత ఒకరు తమకు జరుగుతున్న నష్టం గురించి బయట పెడుతున్న విషయం తెలిసిందే. గత 25 సంవత్సరాలుగా ఎటువంటి మచ్చ లేకుండా నిర్విరామంగా కొనసాగుతున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమంపై తాజాగా సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) చేసిన కామెంట్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 1996లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీరీస్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కీరవాణి (Keeravani ), చంద్రబోస్ (Chandrabose), సునీత (Sunitha) జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరి వల్లే తనకు అన్యాయం జరిగిందని సింగర్ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. సునీత తనపై పక్షపాతం చూపించిందని, కీరవాణి స్టేజ్ పై అమ్మాయిలు కనిపిస్తే చాలు అదోలా చూస్తారని, ప్రొడక్షన్ టీంలో కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా బొడ్డు కిందకు చీర కట్టుకొని రమ్మని విసిగించే వారిని, తన తల్లిని అవమానించింది అని ప్రవస్తి తెలిపింది. ఇలా ఈ విషయం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ సీనియర్ సింగర్ కౌసల్య (Singer Kousalya) కూడా స్పందించింది. ప్రవస్తి మాత్రమే కాదు కెరియర్లో ఎదగకుండా నన్ను కూడా తొక్కేశారు అంటూ కౌసల్య ఆవేదన వ్యక్తం చేసింది.
అవకాశాలు లేకనే ఇండస్ట్రీకి దూరమైన కౌసల్య..
సింగర్ కౌసల్య విషయానికి వస్తే.. ఎన్నో సూపర్ హిట్ పాటలలో పాడి తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది.. రవితేజ (Raviteja ) నటించిన ‘అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి’ సినిమాలో ‘జుమ్ జుమారే’ పాట పాడి ఆడియన్స్ పల్స్ పట్టుకుంది. తన సినీ కెరియర్ లో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (Chakri), అనూప్ రూబెన్స్ , మణిశర్మ వంటి వారితో పాటలు పాడిన ఈమె, దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలలో పాడి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ ఆమె కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదు.తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె, తాను ఇన్ని రోజులు ఏమైపోయింది..? ఎక్కడికి వెళ్ళింది..? అనే విషయాలను చెప్పుకొచ్చింది..
నన్ను కూడా ఇండస్ట్రీ నుండి ఎలిమినేట్ చేశారు – సింగర్ కౌసల్య..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య మాట్లాడుతూ.. “నేను కనబడగానే అందరూ మొదటి నన్ను అడిగే మాట కౌసల్య గారు.. ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ఏమైపోయారు..? ఎలా ఉన్నారు..? మీ పాట వినిపించడం లేదు ఏంటి..? అని అడుగుతున్నారు. వాళ్ళు అలా అడుగుతుంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నాకు కూడా లోపల అదే ప్రశ్న ఉంది. నాకు అవకాశం ఇవ్వనిదే వెళ్లి పాడలేను కదా.. అవకాశాలైతే నాకు పదేళ్ల నుంచి చాలా తగ్గిపోయాయి. డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయన, తుపాకీ రాముడు సినిమాలో నా చివరి పాట పాడాను. ఆ తర్వాత ఒక్క పాట కూడా నేను పాడలేదు. తెలుగులో ఎంతోమంది సింగర్లు ఉన్నారు. రియాల్టీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి. నాకు తెలిసి వాళ్ళు తక్కువ పేమెంట్ కి పాడి ఉండొచ్చు. నేను కూడా ఈ కాలం నాటి సింగర్ ను అయి ఉంటే ఒక పాట కూడా వచ్చేది కాదు.. ఎందుకంటే బయట పరిస్థితులు అలా మారిపోయాయి…అయినా కూడా పదేళ్ల నుంచి ఒక అవకాశం ఇవ్వకుండా తొక్కేశారు.. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి నన్ను ఎలిమినేట్ చేశారు” అంటూ ఎమోషనల్ అయింది. ఏది ఏమైనా ఇలా ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ ని తొక్కేయడం అంటే మామూలు విషయం కాదు.. ఇప్పుడు ప్రవస్తి ఈ విషయాన్ని బయట పెట్టే వరకు కూడా వీరంతా బయటకు రాకపోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.