Song Jae Rim : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్ (Song Jae Rim) ఇక లేరు అన్న వార్త ఆయన అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఆయన కేవలం 39 ఏళ్ల వయసులో ప్రపంచానికి అకాల వీడ్కోలు పలికడం నిజంగా బాధాకరం. నవంబర్ 12న ఆయన మరణించారనే వార్త కొరియన్ వినోద పరిశ్రమలో సంచలనం సృష్టించింది. అయితే అతని మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
నటుడు సాంగ్ జే రిమ్ (Song Jae Rim) సియోల్‌లోని సాంగ్ డాంగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. అతని మృతదేహం దగ్గర ఓ లేఖ కూడా లభ్యమైంది. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా బయట పడకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
నటుడు సాంగ్ జే రిమ్ (Song Jae Rim) దక్షిణ కొరియా చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టార్. రన్‌వే మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సాంగ్ జే రిమ్ ఎంతో మంది పాపులర్ డిజైనర్ లతో కలిసి వర్క్ చేశారు. అంతేకాకుండా చాలా మ్యాగజైన్ పేజీలలో కూడా ఆయన కనిపించారు. సాంగ్ జే రిమ్ 1985లో జన్మించాడు. 2009లో ‘యాక్ట్రెసెస్’ మూవీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. కానీ 2012లో వచ్చిన ‘ది మూన్ ఎంబ్రేసింగ్ ది సన్’లో తన పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. ఫ్లవర్ బాయ్ రామెన్ షాప్, ఇన్‌స్పైరింగ్ జనరేషన్, టూ వీక్స్, గుడ్‌బై మిస్టర్. బ్లాక్, బ్యాడ్ గర్ల్స్, అవర్ గ్యాప్-సూన్, సర్ఫింగ్ హౌస్, ఐ వాన్నా హియర్ యువర్ సాంగ్, క్వీన్ వూ, కేఫ్ మినామ్‌డాంగ్ వంటి అనేక ప్రముఖ టెలివిజన్ డ్రామాలలో రిమ్ భాగమయ్యాడు. ఇటీవల “మై మిలిటరీ వాలెంటైన్” (2022) షోలో నటించాడు. అతను నటించిన సినిమాలలో గ్రాండ్ ప్రిక్స్, ది సస్పెక్ట్, క్రేజీ లవ్, యాచా, బైట్ అండ్ ప్లాప్: ఎ మ్యాన్ హూ లాస్ట్ హిస్ బిజినెస్ ఉన్నాయి.
ఇటీవల ‘ది రోజ్ ఆఫ్ వెర్సైల్లెస్’ నాటకంలో కూడా రిమ్ (Song Jae Rim) పర్ఫామ్ చేశారు. ఇది అక్టోబర్ 13న కంప్లీట్ అయ్యింది. ఇది అతని అకాల మరణానికి ముందు ఇదే చివరి ప్రాజెక్ట్. ఈ సంవత్సరం అతను ‘క్వీన్ వూ’లో కూడా కనిపించాడు. అలాగే ‘వి గాట్ మ్యారీడ్’ సీజన్ 4లో కూడా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఆయన పైప్‌లైన్‌లో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. సమాచారం ప్రకారం ‘ఐ విల్ బీ రిచ్’, ‘డెత్ బిజినెస్’ అనే రెండు ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంది రిమ్.
ఇదిలా ఉండగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. రిమ్ (Song Jae Rim) అకాల మృతి అతని అభిమానులందరినీ బాధ పెట్టింది. నవంబర్ 14న ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిపై ప్రముఖ కొరియన్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొరియన్ సినిమాలను బాగా ఇష్టపడే మూవీ లవర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఇంత చిన్న వయసులో ఓ నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం.