Krishna Health Update : సీనియర్ నటుడు కృష్ణ ఆదివారం రాత్రి నానక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, బయటకు ఉన్న వారికి టెన్షన్‌ను కలిగిస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనే వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్స్ ఈ విషయంపై పాత్రికేయులతో మాట్లాడుతూ ‘‘ఆదివారం రాత్రి కృష్ణగారు అపస్మారక స్థితిలో హాస్పిటల్‌కు వచ్చారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేశాం. ఇరవై నిమిషాల్లోనే ఆయన గుండెపోటు నుంచి బయట పడ్డారు. ఆయన ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. ఆయన్ని ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తున్నాం. మా హాస్పిటల్‌కు చెందిన బెస్ట్ డాక్టర్స్ ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. 24 గంటలు గడిస్తేనే ఇంప్రూవ్‌మెంట్ ఏంటనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా స్పందిస్తున్నారు’’ అన్నారు.
కృష్ణ కుటుంబ సభ్యులైన మహేష్, నరేష్ తదితరులు హాస్పిటల్‌లోనే ఉన్నారు. కృష్ణ పూర్తి పేరు శివరామకృష్ణ. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటిస్తూ అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. చాలా రోజుల నుంచి ఆయన సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.