England : ఎదురుదాడి వ్యూహాన్ని టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ అమలు చేసింది. అదే వ్యూహంతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసింది. ఓపెనర్లు బట్లర్ , అలెక్స్ హేల్స్ అద్భుతంగా రాణించారు. ఈ టోర్నిలో కెప్టెన్ బట్లర్ 225 పరుగులు సాధించగా..హేల్స్ 212 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది బెన్ స్టోక్స్ . ఈ ఆల్ రౌండర్ 110 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీశాడు. ఫైనల్ లో అద్భుతంగా ఆడి జట్టుకు కప్ అందించాడు.
సామ్ కరన్ ఈ టోర్నిలో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసింది ఈ యువ బౌలరే. సామ్ కరన్ 6 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫైనల్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి సత్తాచాటాడు. శామ్ కరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతోపాటు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది.
4 మ్యాచ్ లు ఆడిన మార్క్ ఉడ్ 9 వికెట్లు తీశాడు. రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడిన జోర్డాన్ 5 వికెట్ల తీసి ఆకట్టుకున్నాడు. అదిల్ రషీద్ 6 మ్యాచ్ ల్లో 4 వికెట్లు మాత్రమే తీసినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఎక్కువ బౌలర్లు అందుబాటులో ఉండటం ఇంగ్లండ్ కు కలిసొచ్చింది. ఏ బౌలర్ విఫలమైనా ప్రత్యామ్నాయం దొరికింది. ఆల్ రౌండర్లలో స్టోక్ తప్ప శామ్ కరన్, క్రిస్ వోక్స్ కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. బ్యాటింగ్ భారం వాళ్లపై పడకుండా చేశారు ఓపెనర్లు హేల్స్ , బట్లర్. అటు ఇంగ్లండ్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఇలా అన్ని రంగాల్లో రాణించిన ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. రెండోసారి ట్రోపిని ముద్దాడింది.