
Super Star Krishna : ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా మిగిలిపోయిన లెజెండరీ యాక్టర్. విల్లు పట్టినా..కత్తి దూసినా.. ఏకలవ్యుడైన ..మన్నెం దొరైన.. కృష్ణ ఠీవి ముందు ఏ పాత్ర అయినా
ఓదిగిపోవాల్సిందే. సినీ ఇండస్ట్రీలో రొమాంటిక్ పాత్ర దగ్గర నుంచి రైతుబిడ్డ వరకు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగే గొప్ప నటుడు కృష్ణ. తేనె మనసులు సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన కృష్ణ తన వైవిద్యమైన నటనతో సూపర్ స్టార్ గా ఎదిగాడు.
పద్మాలయ పిక్చర్స్ అనే సొంత సంస్థను స్థాపించి కృష్ణ నిర్మించిన తొలి చిత్రం అగ్నిపరీక్ష డిజాస్టర్ గా మిగిలింది. అయినా నిరాశ పడకుండా సాహసమే ఊపిరిగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించాడు కృష్ణ. ఈ మూవీ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ సాధించిన సక్సెస్ తో కృష్ణకు డాషింగ్ హీరో అనే ముద్దు పేరు స్థిరపడిపోయింది.
ఈ మూవీ ని చూసిన ఎన్ టి రామారావు రావు సినిమా బాగుంది బ్రదర్ కాకపోతే లేడీస్ సెంటిమెంట్ లేదు. వాళ్ళని కూడా ఆకట్టుకుంటే ఇంకా బాగుండేది.. అన్న మాటలు కృష్ణులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక ఆ తర్వాత కృష్ణ పండంటి కాపురం మూవీ తో మహిళల మనసులు దోచుకున్నాడు. పండంటి కాపురం 100 రోజుల ఫంక్షన్ కి ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచిన కృష్ణ..’అన్నగారితో కలిసి నటించాలి అని అనుకుంటున్నాను. దానికి ఆయన అంగీకరిస్తే పద్మాలయ బ్యానర్స్ పై మూవీని తీయాలనుకుంటున్నాను’అని ఆ మీటింగ్ లో అనడంతో ఎన్టీఆర్ వెంటనే దానికి ఒప్పుకున్నారు. అలా దేవుడు చేసిన మనుషులు చిత్రానికి ప్రారంభం జరిగింది. ఈ మూవీ లో కృష్ణ యాక్టింగ్ కి మంచి మార్కులు వచ్చాయి.
ఇక కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రం అప్పట్లో పెద్ద సాహసోపేతమైన నిర్ణయమే. 33 ఏళ్ల వయసులో ఒక హీరో ఎటువంటి ఫైట్, ఎటువంటి డ్యూయెట్ లేకుండా ఒక వైరాగిగా.. స్వాతంత్ర సమరయోధుడిగా.. అప్పట్లో మూవీ తీయడం అంటే సాహసమే కదా. ఎన్నో భిన్నమైన పాత్రలో నటించిన కృష్ణ మీద హీరోగా అప్పటికే ఒక ఇమేజ్ ఉంది. అన్నిటికీ భిన్నంగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో కృష్ణను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని అందరూ సంశయించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అన్నంతగా కృష్ణ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు.
ఇప్పటికీ స్క్రీన్ పై సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి..అంటూ గుండెలను చీల్చి అక్కడ కాదు రా ఇక్కడ కాల్చు అని ఆవేశంగా చెప్పే కృష్ణ డైలాగ్స్ ఎప్పుడు చూసినా గూజ్ బంప్స్ కలగక మానవు. 12 సినిమాలు వరుస ప్లాపులు అయినా అధైర్య పడకుండా ముందుకు అడుగు వేసిన ధిశాలి కృష్ణ. కెరీర్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న.. ఏ మాత్రం జంకకుండా గెలుపును తన కేరాఫ్ అడ్రస్ గా మలుచుకున్న సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచి నేటికీ సరిగ్గా సంవత్సరం పూర్తి కావస్తోంది.