Thandel:సాయి పల్లవి (Sai Pallavi).. అందం, నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో యువతను ఉర్రూతలూగించిన బ్యూటీ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు కొన్ని ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తన నియమాలను అలాగే కొనసాగిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ‘ఫిదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, మొదటి సినిమాతోనే తన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అంతేకాదు ఇందులో పక్కా తెలంగాణ అమ్మాయిలా నటించి అబ్బురపరిచింది. ఇక తర్వాత ప్రతి సినిమాలో కూడా తన పాత్రను ఆచితూచి ఎంపిక చేసుకుంటూ.. ముందుకు వెళుతున్న సాయి పల్లవి తాజాగా నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచారు.
సాయి పల్లవిని అందుకే ఎంపిక చేసుకున్నాం..
ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో సాయి పల్లవి ఎంపిక నా నిర్ణయమే. ఇది కూడా ఒక కమర్షియల్ నిర్ణయం అని చెప్పాలి. ఈ పాత్ర కోసం నేను ముంబై వెళ్లి ఎవరిని కూడా తీసుకురాలేదు. ముంబై నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం పోయలేరు అనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయితీగా చేయాలి. అందుకే సాయి పల్లవి అయితే 100% న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే ఆ అసాధారణమైన నటిని ఈ పాత్ర కోసం ఎంపిక చేసాము. ఇక మేము అనుకున్నట్లుగానే సాయి పల్లవి కూడా తన పాత్రకు 100% న్యాయం చేసింది. నా నమ్మకాన్ని నిలబెట్టింది” అంటూ సాయి పల్లవి నటనపై ప్రశంసల కురిపిస్తూ ఆమె ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాన్ని చెప్పుకొచ్చారు నిర్మాత అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తండేల్ చిత్ర విశేషాలు..
ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా, నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న చిత్రం తండేల్ . గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పకుడిగా , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు గుజరాత్ కి వేటకు వెళ్ళగా.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ గార్డ్ కు చిక్కి దాదాపు 17 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొదిద్దుకుంది. నాగచైతన్య కెరియర్ లోనే దాదాపు భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం రూ.90 కోట్లు కేటాయించినట్లు సమాచారం. మరి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.